ఆరు నెలల్లో అప్పుల్లో రికార్డు సృష్టించారు…

chandrababu comments on ap govt
Share Icons:

అమరావతి: ఆరు నెలల జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ ఆరు నెలల్లో అప్పుల్లో రికార్డు సృష్టించిందని ఎద్దేవా చేశారు. ఈ 6 నెలల్లో దాదాపు రూ.25వేల కోట్లు అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదని విమర్శించారు. ఒక్క ఆగస్టులోనే 5 సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ… రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానని తిరిగి తనపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాకపొతే సలహాలు తీసుకోవాలి కానీ… అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా? అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

అటు ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు కేవలం ఆరు నెలల్లో సీఎం జగన్ పరిష్కారం చూపారంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఆరు నెలల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ‘6 నెలల్లో 250 మంది రైతుల ఆత్మహత్యలు, 50 మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇద్దరు ఉద్యోగస్తుల ఆత్మహత్యలు, నలుగురు టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మహత్యలు, డెంగ్యూ, మలేరియాతో వందల మరణాలు. జగన్ గారి పరిపాలన ఎంత చెండాలంగా ఉందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదనుకుంటున్నాను’ అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

ఇక రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్ వంచించారని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇస్తానని చెప్పిన జగన్… అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మాట మార్చి జనాల నెత్తిన నవరత్న తైలం రాశారని విమర్శించారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని చెప్పారని… కానీ, రాష్ట్రాన్ని ముంచేసిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. విధ్వంసంతో పాలనను ప్రారంభించిన వైసీపీ… ఆరు నెలలలో రాష్ట్రాన్ని సూసైడ్ ప్రదేశ్ గా మార్చిందని చెప్పారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

 

Leave a Reply