కేంద్రంపై రామ్మోహన్ ఫైర్….వైసీపీపై కేశినేని సెటైర్..

tdp mp rammohanaidu fires on bjp about budget
Share Icons:

ఢిల్లీ:

 

లోక్ సభలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో సందర్భంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపుపై కేంద్రం అనుసరించిన విధానాలను ఎండగట్టారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌పై ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దేశాభివృద్ది అంటే కేవలం గుజరాత్ అభివృద్ది మాత్రమే కాదని, విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు.

 

గుజరాత్ అభివృద్ధి చెందిన రాష్ట్రమని అందరికీ తెలుసని, కానీ అలాంటి రాష్ట్రానికే మళ్లీ గిఫ్ట్ సిటీని ప్రతిపాదించడంపై నాయుడు విమర్శించారు. విభజనతో ఎంతో నష్టపోయిన ఏపీవైపు కన్నెత్తి కూడా చూడకుండా కేవలం గుజరాత్‌కి మాత్రమే అదనపు రాయితీలు ప్రకటించం ఏమిటని ప్రశ్నించారు.

 

ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏపీతో పాటు చిన్న రాష్ట్రాలు ఎన్నటికీ గుజరాత్‌కు పోటీగా నిలిచే అవకాశం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలనే ఎక్కవగా పట్టించుకుంటే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఏపీకి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు సరిగ్గా జరగలేదని అటు అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా కేంద్రంపై విమర్శలు చేస్తోంది.

 

అలాగే మరో టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ లక్ష్యంగా ట్విట్టర్ లో సెటైర్లు వేశారు. కేంద్రం మెడలు వంచి మరి, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రూ.21 కోట్లు జగన్ సాధించడం చాలా గొప్ప విషయమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన 22 మంది ఎంపీలు చాలా గొప్పవాళ్లంటూ సెటైర్లు వేశారు. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యి చూపారని, ప్రత్యేక హోదా గురించిన ప్రస్తావనే లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడంతో టీడీపీ నేతలు జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Leave a Reply