ప్రజావేదిక తొలగింపుపై జగన్‌కి టీడీపీ ఎంపీ సలహా….

Share Icons:

విజయవాడ, 25 జూన్:

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చి వేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ చేసిన ప్రకటనపై పలువురు టీడీపీ నేతలు మండిపడుతుండగా….టీడీపీ ఎంపీ కేశినేని నాని మాత్రం జగన్‌కి ఓ సలహా ఇచ్చారు.

ఇప్పటికిప్పుడు ఈ కట్టడాన్ని కూల్చివేస్తే ప్రభుత్వ ఖజానాకు రెండు రకాలుగా నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రజావేదిక అక్రమమా? లేదా సక్రమమా? అనే విషయాన్ని పక్కనపెడితే… అది ప్రజా ధనంతో నిర్మించిన కట్టడమనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. దీన్ని కూల్చి వేస్తే ప్రజాధనం దుర్వినియోగమవుతుందని చెప్పారు.

మరో వేదికను నిర్మించేంత వరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేట్ వేదికలకు మళ్లీ ప్రజాధనం ఖర్చవుతుందని అన్నారు. ముందుగా ఇతర అక్రమ కట్టడాలను తొలగించాలని… ఈలోపు కొత్త సమావేశ వేదికను నిర్మించి, ఆ తర్వాత ప్రజావేదికను తొలగిస్తే బాగుంటుందని సూచించారు.

ఇక దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, నదీగర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఈ అక్రమ కట్టడాలు ఇల్లు లేని పేదలు కట్టుకున్నవి కాదని.. వ్యవస్థలను మేనేజ్ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవని చెప్పారు. ఇన్నాళ్లు చట్టాల కళ్లు కప్పారని… ఇకపై అలాంటివి సాధ్యం కావని అన్నారు.

విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని… అందువల్లే వాటి పనులు మొదలు కాలేకపోయాయని విజయసాయి రెడ్డి విమర్శించారు.

 

Leave a Reply