టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఇంట్లో తనిఖీలు

Share Icons:

కడప, ఏప్రిల్ 05,

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు శుక్రవారం ఉదయం 6 గంటలకు దాదాపు 30 మంది పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో సీఎం రమేష్‌తో పాటు ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడు కూడా ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం. దీంతో పోలీసులను అడ్డుకున్న సీఎం రమేష్.. సెర్చ్ వారెంట్ ఉందా..? అని వారిని నిలదీయడంతో పోలీసులకు, ఆయనకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.

అయితే ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సమాచారం, ఆదేశాల మేరకే తాము తనిఖీలకు వచ్చామని చెప్పడంతో సీఎం రమేష్ తనిఖీలకు సహకరించినట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల తనిఖీల్లో సీఎం రమేష్ ఇంట్లో ఎలాంటి వస్తువులు గానీ, నగదు గానీ లభించలేదని సమాచారం.

ప్రస్తుతం పోట్లదుర్తిలోని సీఎం రమేష్ అనుచరుల ఇళ్లల్లో మాత్రం సోదాలు కొనసాగుతున్నాయి. పోలీసుల సోదాలపై స్పందించిన సీఎం రమేష్.. ఇది తమను భయభ్రాంతులకు గురిచేసేందుకేనని ఆరోపించారు. కేంద్రం, వైఎస్ జగన్ కలిసి తమపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

టీటీడీ ఛైర్మన్, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంట్లో ఐటీ దాడులు జరిగిన మరుసటి రోజే సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలకు వెళ్లడం గమనార్హం. ఎన్నికల గడువు దగ్గరపడ్డంతో.. నగదు పంపిణీ కోసం భారీ ఎత్తున డబ్బు ఆయన ఇంటికి చేరిందన్న సమాచారంతో పోలీసులు సోదాలకు వెళ్లినట్టు చెబుతున్నారు.

 

మామాట: చట్టం తన పని తానుచేస్తోందిగా,

Leave a Reply