టీడీపీకి ఊహించని షాక్: ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా…

tdp mlc dokka manikya varaprasad fires on cm jagan
Share Icons:

అమరావతి: మూడు రాజధానుల బిల్లు శాసనమండలికి చేరిన వేళ టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. అమరావతి విడిపోతున్నందుకు, మూడు రాజధానులు వ్యతిరేకిస్తున్నాని చెబుతూ డొక్కా ఓ లేఖ కూడా రాశారు.  ఇక భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని పేర్కొన్నారు. అయితే మూడు రాజధానులపై మండలిలో చర్చ జరుగుతున్న సమయంలోనే డొక్కా రాజీనామా చేయడం విశేషం. ఈయన రాజీనామా వెనుక వైసీపీ ఉండొచ్చని టీడీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈరోజు మండలిలో టీడీపీ మూడు రాజధానులని వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటీసు ఇచ్చింది. దీని అంగీకరించిన స్పీకర్ చర్చ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో అధికార వైసీపీ మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుని ప్రవేశ పెట్టింది. అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని.. ప్రభుత్వ పాలసీని వ్యతిరేకిస్తూ తాము ప్రతిపాదించిన తీర్మానం పైన చర్చ చేపట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఆ తరువాతనే ప్రభుత్వ బిల్లులను చర్చకు తీసుకోవాలని టీడీపీ నేతలు ఛైర్మన్ ను కోరారు. బిల్లుల కంటే ముందుగానే తాము నోటీసు ఇచ్చామని..ముందు దీని పైనే చర్చ చేపట్టాలని బిజినెస్ రూల్స్ చెబుతున్నాయని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వాదిస్తన్నారు.

తమ ఎమ్మెల్సీలకు ప్రభుత్వంలోని ముఖ్యులు ఎందుకు ఫోన్లు చేస్తున్నారని యనమల నిలదీసారు. దీనికి కొనసాగింపుగా శాసన మండలిని కించపరిచే విధంగా బొత్స వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని ప్రస్తావించిన యనమల ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఇదిలా ఉంటే అసెంబ్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్పీకర్ తమ్మినేని సీతారామ్ సభ నుంచి వెళ్లిపోయారు. టీడీపీ సభ్యుల తీరుతో మనస్తాపానికి గురవుతున్నానంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరుకు నిరసనగా సభ నుంచి వెళ్లిపోతున్నా అంటూ.. హెడ్ ఫోన్స్ టేబుల్‌పై పడేసి వెళ్లిపోయారు.

 

 

Leave a Reply