రాజధాని నిరసనలు: జగన్‌కు చెవిటి మిషన్, కళ్ళజోడు

Share Icons:

అమరావతి: రాజధాని అమరావతిలోనే ఉంచాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిరసనలు కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే అమరావతి రాజధానిగా ఉంచాలని రాజధాని రైతులు పోరాటం చేస్తున్నా కళ్ళున్న గుడ్డి వాళ్ళలా , చెవులున్న చెవిటి వాళ్ళలా జగన్ ప్రవర్తిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.  జగన్ కు కళ్ళజోడు , చెవిటి మిషన్ పంపి వినూత్నంగా నిరసన తెలిపారు. రాజధాని రైతుల్ని సీఎం జగన్ తన నిర్ణయంతో చాలా క్షోభ పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బుద్దా వెంకన్న అమరావతి రైతుల పట్ల జగన్ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు చెవి మిషన్, కళ్లజోడును కానుకగా పంపిన సందర్భంగామాట్లాడిన ఆయన వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. నేనున్నాను, నేను విన్నాను అని జగన్ అన్నారని , 22 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అని బుద్దా వెంకన్న మండిపడ్డారు.

ఇక అసెంబ్లీలో రాజధానిని అంగీకరించిన జగన్‌ ఇప్పుడు అధికారమదంతో మాట్లాడుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏడు నెలల్లో రంగులు వేసుకోవడం తప్ప చేసిందేమీలేదన్నారు. జగన్‌ స్వార్థం కోసమే రాజధానిని తరలిస్తామంటున్నారని… రాజధాని రైతులతో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం మారితే రాజధాని మారాలా అని నిలదీశారు. జగన్‌కు విభజించి పాలించాలనేది దరిద్రమైన‌ ఆలోచన అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

ఇక రాజధాని అమరావతి రైతుల ఉద్యమంపై మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆమె.. విజయవాడలో సమ్మె చేసే సత్తాలేని వారని.. మహిళలను రోడ్డుపైకి తీసుకువచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు మహిళలను అడిగే అలా ప్రకటించారా? అని ఈ సందర్భంగా పద్మ ప్రశ్నించారు.

 

Leave a Reply