టీడీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ….లోకేశ్ వల్లే పార్టీని వీడుతున్నట్లు ప్రకటన

nara lokesh fires on ysrcp government
Share Icons:

గుంటూరు:

 

తెలుగుదేశం పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరగా..మరికొందరు కూడా చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్…పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన లోకేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమికి లోకేష్‌ వ్యవహారమే కారణమని పార్టీకి రాజీనామా చేసిన స‌తీష్ ఆరోపించారు. కనీస అర్హత లేని లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. లోకేష్‌ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేకపోయారని, అడ్డదారిలో మంత్రిపదవి కట్టబెట్టారని ధ్వజమెత్తారు.

 

లోకేశ్ త‌న మీద గెలిచిన ఆర్కేతో క‌లిసి చ‌ట్ట స‌భ‌ల్లో కూర్చోవ టానికి సిగ్గుండాలి అని తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. లోకేశ్ కు ద‌మ్ముంటే ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని సతీష్‌ సవాల్‌ విసిరారు. లోకేష్‌ పార్టీలోకి వచ్చిన తరువాత గ్రూపులను తయారుచేశారని, హెరిటేజ్‌ సంస్థలా పార్టీ తయారైందని స‌తీష్ ఫైర్ అయ్యారు.

 

స‌తీష్ పార్టీకి రాజీనామా చేసిన త‌రువాత లోకేశ్ ను టార్గెట్ చేస్తూ .. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ ఎప్పడో చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి మరికొంతమంది నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. స‌తీష్ త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి..టీడీపీకి రాజీనామా చేసారు. ఆయ‌న అధికారికంగా ఏ పార్టీలో చేరేది స్ప‌ష్టం చేయ‌క‌పోయినా..బీజేపీలో చేరే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి.

Leave a Reply