వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేల విమర్శలు

Share Icons:

అమరావతి, 14 జూన్:

గవర్నర్ ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశం ముగిశాక అమరావతిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ మీడియాతో మాట్లాడుతూ….
పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కారణంగా ప్రతీ అవ్వాతాత రాబోయే ఐదేళ్లలో రూ.18,000 కోల్పోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.

విడతలవారీగా పెన్షన్ పెంచుతామని చెప్పి ఏదో సాధించామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ చెక్కులకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉందనీ, ఆ చెక్కులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుబంధు పథకం కింద రూ.4,500 కోట్లను టీడీపీ ప్రభుత్వం చెల్లించిందనీ, కానీ వైసీపీ ప్రభుత్వం రెండో విడతను రద్దు చేసిందని మండిపడ్డారు. అసలు ఏపీ ప్రభుత్వ తీరు పొద్దెరగని కొత్త బిచ్చగాడి రీతిలో ఉందని దుయ్యబట్టారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపుల దగ్గరి నుంచి ఏ ఉద్యోగానికి అయినా కొన్ని నిబంధనలు ఉంటాయని, కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిబంధనలు చూపకుండా అర్హతల గురించి చెప్పకుండా గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోందని విమర్శించారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… గవర్నర్ నరసింహన్ కేవలం నవరత్నాల గురించే ప్రస్తావించారని, ఏపీలోని చేతివృత్తుల గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని వ్యాఖ్యానించారు.

అలాగే ఐదు కోట్ల మంది ఆంధ్రుల కల అయిన రాజధాని అమరావతిపై నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply