మోడీ,షాలని కలిసిన జగన్…ఆయన్ని ఎందుకు కలవలేదు…

Share Icons:

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళి, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పందించారు. ‘ప్రధాని, హోంమంత్రిని జగన్‌ ఎందుకు కలిశారు?. తనను దగ్గరకు కూడా రానివ్వరని తెలిసి విదేశాంగమంత్రి జైశంకర్‌ను సీఎం జగన్‌ కలవలేదు.

దేశ పరువును తీసిన జగన్‌ నీతులు చెబుతున్నాడు. ప్రతి ఏటా చంద్రబాబు కుటుంబ ఆస్తులు వెల్లడిస్తున్నారు. కుటుంబ ఆస్తులు వెల్లడించే ధైర్యం జగన్‌కు ఉందా?. టీడీపీ ప్రజా చైతన్య యాత్రలపై వైసీపీ ఎందుకు భయపడుతోంది?’ అని వైసీపీ సర్కార్‌పై రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రస్‌ ఆల్‌ ఖైమా వేటను తప్పించుకునేందుకే జగన్‌ ఢిల్లీ పర్యటన చేశారని ఆయన ఆరోపించారు. అవసరమైతే పువ్వు నీడలో వైసీపీని ఉంచేందుకు సిద్ధపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.

అటు జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. జగన్ పాలనను మరోసారి తుగ్లక్ పాలనతో పోల్చారు. తుగ్లక్ నిర్ణయాలతో నిన్నటి దాకా ప్రైవేట్ పెట్టుబడులు వెళ్లిపోయాయని.. ఇప్పుడు ప్రభుత్వ సంస్థల వంతు వచ్చిందని విమర్శించారు. ఆంధ్రుడు ఏం పాపం చేశాడని.. ఈ అపఖ్యాతి మూటగట్టుకున్నాడని ప్రశ్నించారు. ఓఎన్‌జీసీ తరలి పోతుందంటూ వార్తలు వస్తుండటంతో ఆయన ఈ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే రోజాకు రాజధాని సెగ తగిలింది. గురువారం ఉదయం నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో రోజా పాల్గొన్నారు. విషయం తెలిసిన మహిళలు అక్కడకు చేరుకుని సమ్మిట్ బయట ఆందోళనకు దిగారు.  అమరావతికి న్యాయం చేయాలంటూ మహిళలు నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రోజాను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మహిళలు రోజా కాన్వాయ్‌ను వెంబడించారు.

 

Leave a Reply