జగన్‌కి పిచ్చి ముదిరి పాకానపడుతోంది..

Share Icons:

అమరావతి: ఏపీ ప్రభుత్వం పింఛన్ల తీసివేతపై టీడీపీ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, పింఛన్ రద్దు అయిన మహిళలు, వృద్దులు హాజరయ్యారు. వృద్దులు, వికలాంగులు, వితంతు పెన్షన్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. పెన్షన్ లేకపోతే వృద్దులు, వికలాంగులు ఎలా బతకాలని గద్దె రామ్మోహన్ మండిపడ్డారు.

వీరు ఆత్మస్థైర్యంతో జీవించాలని 200 ఉన్న పెన్షన్‌ను టీడీపీ 2000 వేలకు పెంచిందన్నారు. జగన్‌కి వైసీపీ వారు తప్ప రాష్ట్రంలో ఎవ్వరూ కనిపించడం లేదన్నారు. జగన్‌కి పిచ్చి ముదిరి పాకానపడుతోందన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే.. ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.

అటు పెన్షన్‌ల రద్దుపై టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. సోమవారం విశాఖ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. పెన్షన్‌లను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహానికి టీడీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. అనంతరం జీవీఎంసీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తొలగించిన వారికి పెన్షన్ ఇవ్వాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. పెద్దఎత్తున పెన్షన్ దారులు, టీడీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే అమరావతి కోసం దీక్ష చేబట్టిన యువకుల దీక్షను పోలీసులు గత అర్ధరాత్రి భగ్నం చేసి, వారిని ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. వీరి ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయినప్పటికీ గుండెలపై ‘సేవ్ అమరావతి’ ప్లకార్డును పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘ఆరోగ్యం విషమించినా రాష్ట్ర భవిష్యత్తు అయిన అమరావతిని మాత్రం వదలలేదు. పోలీసులు దీక్ష భగ్నంచేసినా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు యువకులు. ఆందోళనలు 55వ రోజుకు చేరినా జగన్ గారి మనసు కరగడం లేదు. జగన్ గారు ఈ రోజు అమరావతి రైతులకు చేసిన అన్యాయం రేపు విశాఖ రైతులకు చెయ్యరని నమ్మకం ఏంటి?’ అని ప్రశ్నించారు.

 

Leave a Reply