ఆ ఎమ్మెల్యే పార్టీ మారకుండా ఉండి ఉంటే మంత్రి పదవి దక్కేదేమో…!

Share Icons:

అమరావతి, 17 జూన్:

ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక సీట్లు గెలిచి… ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లకి మాత్రమే పరిమితమైంది. ఇక జనసేన అయితే ఒక సీటుని దక్కించుకుంది.

అయితే గత టీడీపీ ప్రభుత్వం చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలని  పార్టీలోకి తీసుకుంది. అలా పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలలో ఒకరు తప్ప మిగతా ఎవరు కూడా ఈ ఎన్నికల్లో గెలవలేదు.

కానీ అద్దంకి నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవి కుమార్ ఘనవిజయం సాధించారు. రవికుమార్‌కు పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుని నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన తొలిసారి 2004లో మార్టూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే రెండో సారి మాత్రం 2009లో అద్దంకి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి మరోసారి విజయం సాధించారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో వైసీపీలోకి చేరి వైసీపీ నుంచి మూడో సారి గెలుపొందారు. అయితే 2014 ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడం, టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో టీడీపీలోకి మారిపోయారు. అయితే టీడీపీలో మాత్రం ఈయనకు తగిన గుర్తింపు రాలేదు, మంత్రి పదవి దక్కలేదు.

అయితే ఈ సారి జరిగిన ఎన్నికలలో టీడీపీ నుంచి మళ్ళీ పోటీ చేసి వైసీపీపై విజయం సాధించారు. అయితే ఇప్పుడు టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి రావడంతో తన మంత్రి పదవిపై ఆశలు వదులుకున్నారు. అయితే 2014లో టీడీపీలో చేరకుండా ఉండి ఉంటే వైసీపీలో జగన్ ఖచ్చితంగా ఈ సారి మంత్రివర్గంలో చోటు దక్కేదని ఆయన సహచరుల వద్ద భాదపడుతున్నట్లు తెలుస్తోంది.

 

Leave a Reply