సీబీఐ అధికారులను మార్చాలని అడగడం ఎంతటి దౌర్భాగ్యం

Share Icons:

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ తీవ్రంగా మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో జగన్‌కు శిక్ష పడడం ఖాయమని బుచ్చయ్య చౌదరి అన్నారు. టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసుల విచారణకు జగన్‌ ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. పదవులతో సంబంధం లేకుండా విచారణకు సహకరించాలి కదా? అని అన్నారు.

అటు సీబీఐ అధికారులను మార్చాలని అడగడం ఎంతటి దౌర్భాగ్యం అని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసుపై ఎన్నిసార్లు మాట మారుస్తారు? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టారని, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికి లెక్కలు చూపించారా? అని నిలదీశారు.

ఇక ఐటీ దాడుల నేపథ్యంలో వైసీపీ నేతలు తమ పార్టీపై చేస్తోన్న ఆరోపణలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ‘ప్రాథమిక విచారణలోనే 43 వేల కోట్లు జగన్ గారు కొట్టేసినట్టు తేలింది. విచారణ పూర్తయితే ముఖ్యమంత్రిగా చేస్తున్న అవినీతితో కలిపి 20 లక్షల కోట్లు దొరుకుతాయి. విజయసాయిరెడ్డి గారి శేష జీవితం జగన్ గారితో కలిసి జైలు ఊచలు లెక్కపెట్టడమే’ అని చెప్పారు.

‘జగన్ అవినీతి సామ్రాజ్యం, సూట్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్, క్విడ్ ప్రో కో లాంటి అంశాల గురించి తెలుసుకొని ప్రపంచ కార్పొరేట్ సంస్థలే ఆశ్చర్యపోయాయి. ప్రపంచంలోని పెద్ద యూనివర్సిటీల్లో జగన్ గారి అవినీతి చరిత్రని కేస్ స్టడీలుగా చెబుతున్నారు’ అని బుద్ధా వెంకన్న అన్నారు. ‘ఘోరమైన అక్రమాలకు పాల్పడి ఐఏఎస్ అధికారులను సైతం జైలుకి తీసుకెళ్లిన దరిద్రమైన చరిత్ర ఉన్న జగన్ గారు, విజయసాయిరెడ్డి  గారు ఐటీ రైడ్స్ గురించి మాట్లాడటం నీతులు వల్లించడం చాలా కామెడీగా ఉంది’ అని అన్నారు.

 

Leave a Reply