బీజేపీలోకి బాలకృష్ణ బంధువు…చిరంజీవి వస్తే స్వాగతిస్తాం….

tdp mla balakrishna relative joins bjp
Share Icons:

 

అమరావతి, 26 జూన్:

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ నుంచి పలువురు నేతలు….ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరగా…తాజాగా అంబికా కృష్ణ ఆ పార్టీలో చేరిపోయారు.

అయితే ఇప్పుడు పామర్రు నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు పొట్లూరి కృష్ణబాబు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పొట్లూరి కృష్ణబాబు తన భార్యతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇకపోతే బాలకృష్ణ, పురంధీశ్వరిలకు దగ్గరి బంధువులను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు పురంధీశ్వరి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నేత, మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలోనే భారీ కుదుపులు రాబోతున్నాయని ప్రకటించారు.

కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి బీజేపీకిలోకి భారీగా చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవి వంటి ఉన్నతమైన విలువలు, ప్రజాభిమానం ఉన్న వ్యక్తి బీజేపీలోకి చేరితే మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం యువనాయకత్వం బీజేపీ వైపు చూస్తోందని చెప్పారు. 2024 నాటికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా 150 మంది నేతలు తెరమెరుగు అయిపోతారని హెచ్చరించారు.

 

Leave a Reply