బాబుకు మరో తలనొప్పి: అనంత నేతల రచ్చ…

main leaders ready to leave tdp
Share Icons:

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు అసలు టైమ్ బాగోలేదు అనుకుంటా. ఇప్పటికే చాలాచోట్ల టీడీపీ అభ్యర్ధులు నామినేషన్స్ వేయలేకపోయారు. అటు నేతలంతా క్యూ కట్టి వైసీపీలోకి వెళుతున్నారు. అలాగే పలు చోట్ల సీట్ల గురించి నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే అనంతపురం కార్పొరేషన్‌లో రచ్చ జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీ, జేసీ పవన్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.

అనంతపురం నగరపాలకసంస్థ ఎన్నికల్లో తాను సూచించినవారికి కొన్ని కార్పొరేటర్‌ స్థానాలు కేటాయించాలని ఆ పార్టీ అనంతపురం పార్లమెంటు ఇన్‌చార్జి జేసీ పవన్‌ పట్టుబట్టుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభాకర్‌చౌదరి మాత్రం అలా ఇచ్చే ప్రసక్తేలేదని ఆ పార్టీ జిల్లా నాయకత్వానికి తెగేసి చెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అవసరమైతే దేనికైనా సిద్ధమనే సంకేతాలు ఆయన పంపినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.

అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసిన సందర్భంలో ఎమ్మెల్యే అభ్యర్థికంటే తనకే అధికంగా ఓట్లు వచ్చాయని, ఈ నేపథ్యంలో పార్టీలో పనిచేస్తున్న తన వర్గీయులకు కనీసం 12 కార్పొరేటర్‌ స్థానాలైనా ఇవ్వాలని జేసీ పవన్‌ జిల్లా నాయకత్వాన్ని కోరిన నేపథ్యంలో ఆ రెండువర్గాల మధ్య టికెట్ల లొల్లి బహిర్గతమైంది. దీంతో జిల్లా నాయకత్వం చేసేదేమీలేక పార్టీ అధిష్ఠానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా, మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు శుక్రవారం అఖరు రోజు కావడంతో ఆ లోగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? అనేది తెలియకుండా ఉంది. కాగా, ఇప్పటికే 40 డివిజన్లకు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరో 10 కార్పొరేటర్‌ స్థానాలకు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంది.

 

Leave a Reply