చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ నేతలు!

Share Icons:

అమరావతి, ఏప్రిల్ 20,

ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే పార్టీ నేతలతో సమావేశమై ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ఓ అంచనాకు రావాలని భావిస్తున్న చంద్రబాబుకు కొన్ని చోట్ల టీడీపీ నేతలు షాక్ ఇస్తున్నారు. రాయచూర్‌కు వెళుతూ కర్నూలులో కొద్దిసేపు ఆగిన చంద్రబాబు… పార్టీ తరపున పోటీ చేసిన వారితో సమీక్ష నిర్వహించాలని భావించారు. ఇందుకు సంబంధించి పార్టీ నేతలకు ముందస్తుగానే సమాచారం అందించింది టీడీపీ నాయకత్వం.

అయితే చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశానికి కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు, పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు కొందరు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.  కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో చంద్రబాబు నాయుడు , టీడీపీ అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్‌ సరళిపై అభ్యర్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అయితే ఈ సమావేశానికి కర్నూలు జిల్లాలో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు అఖిల ప్రియ, బుడ్డా రాజేశేఖర్‌ రెడ్డి, కేఈ శ్యాంబాబు, టీజీ భరత్‌, తిక్కారెడ్డి, మీనాక్షి నాయుడు, కేఈ ప్రతాప్‌లు గైర్హాజయ్యారు. వీరంతా ఈ కర్నూలు జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ తరపున పోటీ చేసినవారే కావడం గమనార్హం. నేతలు ఎవరూ సమయానికి రాకపోవడంతో… వచ్చిన నాయకులతోనే వివరాలు అడిగి తెలుసుకుని అనంతరం ఎయిర్‌ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాకు చంద్రబాబు బయలుదేరి వెళ్లారు.

అయితే చంద్రబాబు వస్తున్నారని తెలిసినా… ఈ నేతలు సమావేశానికి డుమ్మా కొట్టడం ఏంటనే అంశం జిల్లా రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వీరిలో కొందరు నేతలు… ఈ నెల 22న జరగబోయే సమావేశానికి నివేదికలు రూపొందించే పనిలో బిజీగా ఉన్నారని… మరికొందరు నేతలకు ఈ సమావేశం గురించిన సమాచారం లేదని టీడీపీలోని కొందరు చర్చించుకుంటున్నారు. కారణం ఏదైనా… చంద్రబాబు కర్నూలు సమావేశానికి టీడీపీ నేతలు డుమ్మా కొట్టడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మామాట: ఈ సమీక్షలు కూడా ఈసీ బ్యాన్ చేస్తే బాగున్నన్నా…

Leave a Reply