ఎన్నికలతో పాటు…వలసలకు కూడా బ్రేక్ పడినట్లేనా?

tdp former mla ready join to ysrcp
Share Icons:

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నుంచి వరుసగా నేతలు వైసీపీలోకి క్యూ కట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో వలసలకు కూడా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలు కూడా కొంతకాలం పాటు ఆపరేషన్ ఆకర్ష్ ను వాయిదా వేసుకున్నట్లే కనిపిస్తోంది.

ఏపీ స్ధానిక ఎన్నికల పోరుకు ముందు వైసీపీలో చేరేందుకు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ నేతలెవరూ అంతగా ఇష్టపడలేదు. అప్పటి వరకూ ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తూ వచ్చిన విపక్షాలకు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత పరిస్దితి తెలిసివచ్చింది. స్ధానిక పోరులో సహజంగానే అధికార పార్టీకి ఉండే ఎడ్జ్ తో పాటు ఇతర సానుకూలతలను గ్రహించిన విపక్ష నేతలు వైసీపీలోకి క్యూ కట్టారు. ఓ దశలో దాదాపు పది మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకరివెంట ఒకరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి కండువాలు కప్పేసుకున్నారు. దీంతో ఓ దశలో స్ధానిక పోరులో టీడీపీ, జనసేన వంటి పార్టీలు పూర్తిగా చేతులెత్తేసినట్లే కనిపించింది.

కానీ ఎప్పుడైతే స్ధానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిందని తెలిసిందో విపక్ష నేతలు కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అప్పటివరకూ అధికార వైసీపీ నేతల నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఎదురుచూసిన నేతలంతా ఇప్పుడు వారు ఫోన్ చేసినా తీయడం లేదట. దీంతో చేసేది లేక వైసీపీ కూడా తమ ఆపరేషన్ ఆకర్ష్ కు తాత్కాలికంగా బ్రేక్ వేసేసింది. ఎన్నికల వాయిదా ప్రకటన రావడానికి కొద్ది గంటల ముందే టీడీపీకి చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలోకి వస్తారని తీవ్రంగా ప్రచారం జరిగినా ఆయన మాత్రం చివరి నిమిషంలో వచ్చిన సమాచారంతోనే ఆయన చేరకుండా సోదరులను మాత్రమే వైసీపీలోకి పంపినట్లు తెలుస్తోంది.

ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత వైసీపీ దాడుల భయంతోనో, స్ధానికంగా అధికారుల దాడులతోనో వైసీపీలోకి ఫిరాయిస్తే చాలని వారంతా భావించారు. కానీ స్ధానిక ఎన్నికల పోరు వాయిదా పడిన నేపథ్యంలో తమ వ్యాపారాలపై అధికారుల ఒత్తిళ్లతో పాటు వైసీపీ నేతల దాడులు కూడా నిలిచిపోయాయి. దీంతో వారికి ఒక్కసారిగా ఊరట దక్కినట్లయింది. కాబట్టి వెంటనే తమ వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.

 

Leave a Reply