2019లో వారసులొస్తున్నారు…

some-tdp-leaders-heirs-wanted-ticket-on-2019-elections
Share Icons:

విజయవాడ, జనవరి 6: 

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ యువ కిశోరాలు రాజ‌కీయంగా త‌మ‌ను తాము నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే అదికార పార్టీలో యువ నేత‌ల‌కు ఛాన్స్ ఇస్తున్న‌ట్టు సాక్షాత్తూ.. టీడీపీ అదినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డం కూడా వీరిలో ఊపున‌కు కార‌ణ‌మైంది.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చాటుకునేందుకు నేత‌లు క్యూక‌డుతున్నారు. వీరిలో దాదాపు రాష్ట్రంలోని స‌గానికి పైగా జిల్లాల్లో వార‌సులు గ‌ట్టిగా రంగంలోకి దిగేందుకు పావులు క‌దుపుతున్నారు.

Image result for ashok gajapathi raju daughter

ఉత్త‌రాంధ్ర

ఉత్త‌రాంధ్ర నుంచి ప‌రిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి.. త‌న కుమార్తెను ఎమ్మెల్యేను చేయాల‌ని మురిసిపోతున్నారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబుకు ఇప్ప‌టికే చెప్పారు. అయితే, ఆర్థికంగాను, ప్ర‌జ‌ల్లోనూ ద‌మ్ము లేకుండా పోవ‌డం, పార్టీలోనే ఆమెకు శత్రువులు ఉండటంతో దీనిపై చంద్ర‌బాబు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన‌ ఎంపీ అశోక గ‌జ‌ప‌తిరాజు.. త‌న కుమార్తెను అసెంబ్లీకి పంపాల‌ని నిర్ణ‌యించుకున్నారు ఇప్ప‌టికే బాబుతో ఆయ‌న మంత‌నాలు పూర్తి చేశార‌ని కూడా అంటున్నారు.

అస‌వ‌ర‌మైతే.. తాను త‌న టికెట్‌ను వ‌దులుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. సీనియ‌ర్ మోస్ట్ అయిన అశోక్‌ను అసెంబ్లీకి తీసుకుని పార్ల‌మెంటుకు ఆయ‌న కుమార్తెను ప్ర‌మోట్ చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇక‌, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్య‌న్న పాత్రుడు త‌న కుమారుడు విజ‌య్‌ను అన‌కాప‌ల్లి ఎంపీగా ప్ర‌మోట్ చేసుకోవాల‌ని త‌హ‌త‌హ లాడుతున్నారు. అయితే, అసెంబ్లీకి పోటీ చేస్తాన‌ని విజ‌య్ అంటున్నార‌ని స‌మాచారం. కానీ, అయ్య‌న్న మాత్రం అన‌కాప‌ల్లి నుంచి త‌న కుమారుడికి టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు.

Image result for murali mohan daughter in law

తూర్పుగోదావ‌రి

తూర్పుగోదావ‌రి జిల్లా తుని నుంచి త‌న కుమార్తెను రంగంలోకి దింపాల‌ని మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. య‌న‌మ‌ల వ‌ర్గం బాగా వీక్‌గా ఉండ‌డంతో చంద్ర‌బాబు త‌ట‌ప‌టాయిస్తున్నారు.

కానీ, త‌న‌కే టికెట్ ఇచ్చాన‌నుకుని.. త‌న కుమార్తెకు ఇవ్వాల‌ని య‌న‌మ‌ల గ‌ట్టిగానే ప‌ట్టుబ‌డుతున్నారు. కానీ, గ‌త ఎన్నిక‌ల్లో య‌న‌మ‌ల సూచ‌న‌ల మేర‌కు.. ఆయ‌న త‌మ్ముడు కృష్ణుడుకు చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. కానీ, ఆయ‌న ఓడిపోయారు. దీంతో చంద్ర‌బాబు డోలాయ‌మానంలో ప‌డ్డారు. ఇక‌, ఇదే జిల్లాకు చెందిన రాజ‌మండ్రి ఎంపీ స్థానం నుంచి త‌న కోడ‌లు రూపాదేవికి ఇవ్వాల‌ని సిట్టింగ్ ఎంపీ ముర‌ళీమోహ‌న్ ప‌ట్టుబ‌ట్టారు. అయితే, ఇది మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు అస‌లు ఈ విష‌యాన్నే బుట్ట‌దాఖ‌లు చేశారు.. దీంతో ఎందుకైనా మంచిది అనుకున్న ముర‌ళీ మోహ‌న్ తానే కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

తాజాగా అమ‌రావ‌తిలో చంద్ర‌బాబును క‌లిసి త‌న కోడలు చేస్తున్న కృషిని ప్ర‌త్యేకంగా వివ‌రించాట‌. అంటే మ‌ళ్లీ మ‌రోసారి రూపాదేవి ప్ర‌స్తావన వ‌చ్చింది. అయినా చంద్ర‌బాబు హామీ ఇవ్వ‌లేదు.

కృష్ణా రాజకీయం

ఇక‌, కృష్ణాజిల్లాలోనూ వార‌సుల రాజ‌కీయం ఊపందుకుంది. మ‌చిలీప‌ట్నం ఎంపీగా ఉన్న కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌.. త‌న కుమారుడికి సీటు ఆశిస్తున్నారు. తాము పార్టీకి వీర విధేయుల‌మ‌ని, పార్టీకి ఎంతో చేస్తున్నామ‌ని, ఈ ద‌ఫా తమకు రెండు టికెట్లు ఇవ్వాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. అంటే ఒక‌టి ఆయ‌న‌కు రెండోది త‌న కుమారుడికి. దీంతో చంద్ర‌బాబు ఉలిక్కిప‌డ్డారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని తెలుసుకున్నారు. దీంతో ఒక టికెట్ మాత్ర‌మే ఇస్తామ‌ని చెప్ప‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.

Image result for kodela siva prasad son

గుంటూరు

గుంటూరు విష‌యానికి వ‌స్తే.. ఇదొక మ‌హాసామ్రాజ్యంగా మారిపోయింది. ఇక్క‌డ ఒక‌రు కాదు.. ముగ్గురు కీల‌క నేత‌లు త‌మ వార‌సుల‌కు టికెట్ల కోసం భారీ ఎత్తున కృషి చేస్తున్నారు. స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌, ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, మాజీ మంత్రి, కాంగ్రెస్ నుంచి వ‌చ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్న గాదె వెంక‌ట‌రెడ్డిలు కూడా త‌మ త‌మ వారసుల‌కు టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. వీరిలో కోడెల మాత్రం త‌న కొడుకుతోపాటు కూతురు విజ‌య‌ల‌క్ష్మిని కూడా రంగంలోకి దింపారు. ఆమెను చంద్ర‌బాబుకు ప‌రిచ‌యం చేశారు. టికెట్ ఇస్తే గెలిపించుకునే బాధ్య‌త‌ను తీసుకుంటాన‌ని చెప్పారు.

దీంతో ఒకే కుటుంబానికి మూడు టికెట్లా? అంటూ చంద్ర‌బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇక‌, రాయ‌పాటి అవ‌స‌ర‌మైతే.. త‌న టికెట్‌ను త్యాగం చేస్తాన‌ని త‌న కుమారుడు రంగారావుకు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. గాదె వెంక‌ట రెడ్డి బాప‌ట్ల టికెట్ కోరుతున్నారు. అయితే, ఆయ‌నకు స‌హ‌క‌రించేందుకు స్థానిక టీడీపీ నేత‌లు సిద్ధంగా లేక‌పోవ‌డంతో ఆయ‌న త‌న కుమారుడికైనా టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.

Related image

ప్ర‌కాశంలో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది.

అద్దంకి టికెట్‌ను మ‌ళ్లీ త‌న‌కుమారుడికే ఇవ్వాల‌ని క‌ర‌ణం బ‌లరాం ప‌ట్టుబ‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇస్తే.. గెలిపించుకోలేక పోయిన క‌ర‌ణం.. మ‌ళ్లీ త‌న‌కుమారుడు వెంక‌టేష్‌కు ఇస్తే.. గెలిపించుకుంటాన‌ని చెబుతున్నారు. ఇవ్వ‌క‌పోతే..!! అంటూ హెచ్చ‌రిక‌లు పంపే స్థాయికి ఆయ‌న చేరిపోయారు. ఇదే జిల్లాలో మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌తోపాటు త‌న కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. శిద్దా త‌న కుమారుడిని రంగంలోకి దింపి..క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. అయితే, చంద్ర‌బాబు ఈ విష‌యంలో క్లారిటీకి రాలేదు.

ఇక‌, క‌ర్నూలు జిల్లాలో మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కుమారుడు కూడా రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు. ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించాల‌ని కేఈ కూడా చూస్తున్నారు. దీనిపైనా బాబు క్లారిటీ ఇవ్వ‌లేదు.

Image result for paritala sriram

అనంత‌పురం

అనంత‌పురం జిల్లాలోనూ వార‌సుల హ‌వా భారీగానే క‌నిపిస్తోంది. ఒక‌ప‌క్క ప‌రిటాల ర‌వి వార‌సుడు శ్రీరాం.. పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గాన్ని కోరుతున్నారు.

అయితే, ప‌రిటాల సునీత కూడా త‌న స్థానం క‌దిలి పోకుండా చూసుకుంటూనే త‌న కుటుంబం పార్టీకోసం త్యాగాలు చేసింది కాబ‌ట్టి రెండు టికెట్లు ఇస్తే త‌ప్పేంటి అంటున్నారు.

అనంత‌పురం జిల్లాకే చెందిన జేసీ దివాక‌ర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను రిటైర్ అవుతాన‌ని, త‌న కుమారుడు ఎంపీగా గెలుస్తాడ‌ని ఆయ‌న ఇప్ప‌టికే ప‌లు స‌భ‌ల్లో ప్ర‌క‌టిస్తూవ‌చ్చారు. అంటే.. అనంత‌పురం ఎంపీ ట‌కెట్ ఖ‌చ్చితంగా త‌న కుమారుడిదేన‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు. అయితే, ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే. . నిన్న మొన్న‌టి వ‌ర‌కు రిటైర్ అవుతాన‌న్న జేసీ.. ఇప్పుడు టంగ్ మార్చారు. ఏమో. బాబు నాకు కూడా టికెట్ ఇస్తే పోటీ చేస్తా అంటున్నారు.

Image result for jc pavan reddy

ఇక‌, ఈయ‌న సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా ఇదే త‌ర‌హారాజ‌కీయాలు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు అస్మిత్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఈయ‌న పోటీ నుంచి త‌ప్పుకొని త‌న కుమారుడికి అవ‌కాశం ఇవ్వాలంటారా? లేక త‌నకు, త‌న కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాల‌ని అంటారా? స‌ందేహంలో ప‌డింది. ఏదేమైనా.. వీరిలో గెలుపు గుర్రాలు ఎవ‌రు? చిత్తుగా ఓడేదెవ‌రు? అనే విష‌యంలో చంద్ర‌బాబుకు క్లారిటీ ఉన్నా.. ఇప్ప‌టికిప్పుడు ఏమీ చెప్ప‌లేక త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. అటు ఇవ్వ‌న‌ని చెప్ప‌లేక‌.. ఇటు ఇస్తాన‌ని అన‌లేక‌.. ఏం చేయాలో తెలియ‌క కాలం వెళ్ల‌దీస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మామాట: మరి 2019లో ఎవరి వారసులు బరిలో ఉంటారో చూడాలి…

Leave a Reply