వైసీపీ తీరు చూస్తుంటే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా లేవు..

Share Icons:

 

అమరావతి:

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, తెదేపా నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజధాని అమరావతి విషయంలో తెరముందుకు వచ్చి మాట్లాడుతున్నది మంత్రి బొత్స సత్యనారాయణే అయినా వెనుక నుంచి మాట్లాడిస్తున్నది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ప్రభుత్వ ఉద్దేశాన్ని మంత్రి వెల్లడిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తే దాన్ని నాశనం చేయడానికి జగన్‌ కంకణం కట్టుకున్నారని ఘాటుగా విమర్శించారు. వైసీపీ నాయకుల తీరు చూస్తే రాష్ట్రానికి పెట్టుబడు వచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి హైదరాబాద్‌ను ఆర్థికంగా పెంచడమే ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యమని చెప్పుకొచ్చారు.

ఇక మరొక సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. తెలంగాణవారికి ఏపీలో పదవులను కట్టబెట్టడంపై ఆయన ప్రశ్నలు సంధించారు. ఏపీలో రిజర్వేషన్లు మారాయా ముఖ్యమంత్రి గారూ? అని ప్రశ్నించారు. స్థానికులకు 75 శాతం, తెలంగాణవారికి 25 శాతం రిజర్వేషన్లు నిజమేనా అని అడిగారు.

ఆంధ్రులను గతంలో దుర్భాషలాడిన సాక్షి ఛానల్ ఉద్యోగి, తెలంగాణవాసి అమర్ కు కేబినెట్ హోదాతో పదవిని, నల్గొండ జిల్లా వాసి విజయకుమార్ కు సమాచార కమిషనర్ పదవి, ఖమ్మం వాసి కృష్ణమోహన్ కు కమ్యూనికేషన్ సలహాదారుగా పదవిని కట్టబెట్టారని అన్నారు. తాజాగా ఖమ్మం వాసి సాక్షి ఎడిటర్ రామచంద్రమూర్తికి కేబినెట్ హోదాతో పదవిని ఇవ్వడం ఏమిటి సార్? అని ప్రశ్నించారు. తెలంగాణవారికి మన పదవులను ఇవ్వడంలో మతలబు ఏంటని నిలదీశారు.

 

Leave a Reply