అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి కులాల గురించి మాట్లాడటమేంటి..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఈసీపై జగన్ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చేలా ఉన్నాయన్నారు.
ముఖ్యమంత్రి కులాల గురించి మాట్లాడటమేంటీ?. తమ్మినేని సీతారాం స్పీకర్ పదవికి అనర్హుడు. కులాలకు ఎవరు ప్రాధాన్యత ఇచ్చారో చర్చకు వైసీపీ సిద్ధమా..?. ఏపీలో 4 వారాలు కరోనా రాదని సీఎస్ ఎలా చెబుతారు?. స్థానిక ఎన్నికలకు, కేంద్రం నిధుల విడుదలకు సంబంధం లేదని రమేష్‌కుమార్ చెప్పినా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్ తన వ్యవహారశైలిని మార్చుకోవాలి’ అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే తనకున్న పరిచయాలతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించారంటూ చంద్రబాబుపై సీఎం జగన్ ధ్వజమెత్తగా, ప్రపంచమంతా కరోనాను హడలెత్తి పోతుండగా, జగన్ మాత్రం తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అటు చంద్రబాబు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. నాడు సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి చేసిన హంగామాకు, ఇవాళ జగన్ రాష్ట్ర ఎన్నికల సంఘంపై చేస్తున్న హంగామాకు పెద్దగా తేడా ఏమీలేదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, జగన్, చంద్రబాబు పరస్పరం వ్యాఖ్యలు చేసుకున్న వీడియోను కూడా టిట్టర్ లో పోస్టు చేశారు.