మోదీని విబేధించకుంటే బాగుండేది…మళ్ళీ మోదీ, బాబు, పవన్…

pm-modi-expand-central-cabinet-once-again
Share Icons:

అమరావతి: ఏపీ రాజధాని అంశంపై టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందని, అందరూ‌ ధైర్యంగా ఉండాలని మందడంలో రైతుల దీక్షలకు రాయపాటి సంఘీభావం‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులనేది హాస్యాస్పదమన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దు… కేంద్రం అన్నీ గమనిస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి పోటీ‌ చేస్తారని జోస్యం చెప్పారు. చంద్రబాబు హయాంలో కూడా కొన్ని తప్పులు జరిగాయని, మోదీని విబేధించకుంటే బాగుండేదని రాయపాటి అభిప్రాయపడ్డారు. ఒకే సామాజిక‌ వర్గం అంటూ అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఆడవాళ్లను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని, అవసరమైతే నాలుగు రాళ్లు ‌వారి మీద వేయండని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డాను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. అదే సమయంలో.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎంపీ తేజస్వి సూర్య కూడా నడ్డా నివాసంలో ఉన్నారు.

సీఎం జగన్ ‘మూడు రాజధానుల ప్రతిపాదన’ అనంతరం రాష్ట్రంలో దాదాపు నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆయన కేంద్ర పెద్దలతో చర్చించారు. రాజధాని మార్పు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అశాంతిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అది కేంద్ర ప్రభుత్వ ధర్మం… బాధ్యతని రైతులను కలిసిన సందర్భంలో వ్యాఖ్యానించారు.

ఇక రేపు ఉదయం 11గంటలకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విశాఖకు వెళ్లనున్నారు. విశాఖ నుంచి రోడ్డుమార్గాన కాకినాడకు ఆయన వెళ్లనున్నారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడినవారిని పవన్‌ పరామర్శించనున్నారు. తర్వాత పార్టీ ముఖ్యనేతలతో సమావేశంకానున్నారు.

 

Leave a Reply