ఆ మాజీ మంత్రులు రాజకీయాలకు దూరం కానున్నారా?

Share Icons:

అమరావతి:

తెలుగుదేశం ఓటమి తర్వాత కొందరు మాజీ మంత్రులు రాజకీయాలకు దూరం కాబోతున్నారని తెలుస్తోంది. మామూలుగా 2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు మరో 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతామని భావించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఐదేళ్లలోనే అధికారం కోల్పోయారు. దీంతో చాలామంది మాజీ మంత్రులు రాజకీయ సన్యాసం వైపు పయనిస్తున్నారని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా  మాజీ మంత్రి నారాయణ ఉన్నారని తెలుస్తోంది.

నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్న నారాయణ 2014లో ఎమ్మెల్సీ అయిపోయి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు.  ఇక మొన్న ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతో నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ చేతుల్లో ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పెద్దగా అడ్రెస్ లేరు. పార్టీలో యాక్టివ్ గా లేరు. జగన్ ప్రభుత్వం ఎక్కడ తమ విద్యాసంస్థలపై నిఘా పెడుతోందో అని సైలెంట్ అయిపోయారు. పైగా సైలెంట్ గా ఉండటమే కాకుండా ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అటు తెలుగుదేశంలో, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నుంచి పోటీ చేయని యనమల మెల్ల మెల్లగా రాజకీయాలకు దూరమవుతున్నట్లు కనపడుతోంది. అలాగే మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా కుమారుడు విజయ్ కు బాధ్యతలు అప్పగించేసి  తాను సైలెంట్ అయిపోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీలో వివాదాల నేతగా ఉన్న మాజీ స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివ ప్రసాద్ కూడా రాజకీయాలకు దూరమయ్యే ఛాన్స్ ఉంది.

అదేవిధంగా ఆరోసారి గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరీ కూడా వచ్చే ఎన్నికల నుంచి పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించేశారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కాబట్టి తను నెక్స్ట్ ఎన్నికల బరిలో ఉండనని ప్రకటించారు. అలాగే మిగతా సీనియర్ నేతలు కూడా తప్పుకుని యువతకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇటు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరమైపోయినట్లే. మొన్న ఎన్నికల్లో జేసీ పోటీ చేయకుండా కుమారుడుకు అవకాశం ఇచ్చారు. కాకపోతే ఆయన అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి హడావిడి చేసి వెళ్లిపోతున్నారు. కానీ మునుపటిలా రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు.

Leave a Reply