విజయవాడ మేయర్ పీఠంపై పట్టు బిగిస్తున్న టీడీపీ…

tdp focus on vijayawada corporation
Share Icons:

విజయవాడ: రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడ కార్పొరేషన్‌పై టీడీపీ పట్టు బిగిస్తుంది.  ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖ తరలించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వచ్చిన విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలు టీడీపీకి కొత్త ఊపిరినిచ్చాయి. అమరావతి ఉద్యమ ప్రభావం విజయవాడపై ఉండటం, తన కూతురు శ్వేతను ఎన్నికల బరిలోకి దింపేందుకు ఇంతకన్నా మంచి తరుణం రాదని గ్రహించిన ఎంపీ కేశినేని విషయాన్ని చంద్రబాబు చెవిలో వేశారు. దీంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

స్ధానికంగా ఎంపీగా ఉండటంతో పాటు అమరావతి ఉద్యమ ప్రభావం, వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వంటి అంశాల నేపథ్యంలో తన కుమార్తె శ్వేతను కేశినేని 11వ డివిజన్ నుంచి రంగంలోకి దింపారు. అంతే కాదు టీడీపీ తరపున మేయర్ అభ్యర్దిగా కూడా అవకాశం ఇప్పించుకోగలిగారు.

ఎంపీ కేశినేని కూతురే మేయర్ అభ్యర్ధిగా బరిలోకి దిగడంతో ఆమె గెలుపును అడ్డుకునేందుకు వైసీపీ ఇప్పుడు సర్వశక్తులూ ఒడ్డేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఉన్నత విద్యావంతురాలు కావడం, గతంలో తండ్రి కేశినేని తరఫున పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి సైతం తిరిగిన అనుభవం, స్దానికంగా ఉన్న పరిచయాలు, ఎంపీ కుమార్తెగా ఆదరణ వంటి అంశాలు శ్వేతకు పాజిటివ్ గా ఉన్నాయి. అదే సమయంలో అమరావతి ఉద్యమం సైతం ఆమెకు మైలేజ్ గా మారబోతోంది. అందుకే ముందుగా 11వ డివిజన్ లో ఆమెను ఓడిస్తే చాలు మేయర్ సీటు ఎలాగో దక్కదని గ్రహించి అక్కడి నుంచే తమ పోరు ప్రారంభించేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది.

ఇదిలా ఉంటే కేశినేని నాని మాట్లాడుతూ…మన విజయవాడను మనమే కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  గత 9 నెలల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అధోపాతాళానికి తొక్కేశారని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చేజేతులా కాలతన్నుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మంచి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో మళ్లీ ఓ బీహార్‌లా మార్చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాలను నాశనం చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ధ్వజమెత్తారు. కేసుల మాఫీ కోసం సీఎం జగన్.. బీజేపీకి అమ్ముడుపోయారని విమర్శించారు. విజయవాడలో 45 నుంచి 50 సీట్లు టీడీపీనే గెలవబోతుందని, మేయర్ పీఠం టీడీపీదేనని కేశినేని నాని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Leave a Reply