టీడీపీ ఛలో ఆత్మకూరు బంద్: చంద్రబాబు హౌస్ అరెస్ట్..నిరాహారదీక్ష

tdp chalo atmkuru stops police...chandrababu house arrest
Share Icons:

అమరావతి:

తెలుగుదేశం పార్టీ వైసీపీ బాధితులా పునరావాస కేంద్రాన్ని గుంటూరులో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే బాధితులని చంద్రబాబు స్వయంగా ఈరోజు ఆత్మకూరు తీసుకెళ్తానని ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునివ్వడంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఆత్మకూరు వెళ్లడానికి పర్మిషన్ లేదని చెబుతూ…మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

మరోవైపు, ఉండవల్లి గుహల వద్ద దేవినేని అవినాశ్, చంద్రదండు ప్రకాశ్, గోనుగుంట కోటేశ్వరరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో 144 సెక్షన్ విధించిన పోలీసులు, పల్నాడులో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నారు. అటు చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, గద్దె రామ్మోహన్‌రావు, కృష్ణా జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రకాశం జిల్లాలో శిద్దా రాఘవరావు, అశోక్ రెడ్డి‌లను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కృష్ణా జిల్లాలో టీడీపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేటలో టీడీపీ నేత అరవిందబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి యాదవ్‌లకు నోటీసులు జారీ చేశారు.

అలాగే టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి బయలుదేరిన లోకేశ్‌ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఛలో ఆత్మకూరు’ను అడ్డుకోవడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అరెస్ట్‌లను ఖండించారు. నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.

జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని, దీన్ని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా..? శిబిరంలో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుషమని చంద్రబాబు వాపోయారు. బాధితులకు సంఘీభావంగా అందరూ నిరసనలు తెలపాలన్నారు. ఈ రోజు ఉదయం 8గం నుంచి రాత్రి 8వరకు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అందరూ దీక్షల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో విఫలం అయ్యారని, న్యాయం చేయమన్న టీడీపీపై కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

 

Leave a Reply