ప‌రువు పోగొట్టుకుంటున్న తెలుగుదేశం

Share Icons:

ప‌రువు పోగొట్టుకుంటున్న తెలుగుదేశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ కేంద్రంలోని ఎన్ డి ఏ ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తెస్తున్న మిత్ర ప‌క్షం తెలుగుదేశం పార్టీ ఏం సాధించ‌కుండానే మౌనంగా ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

రాజ‌కీయాల సంగ‌తి ఎలా ఉన్నా ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు తీర‌ని న‌ష్టం క‌లిగిస్తున్న‌ది.

కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రం, రాజ‌ధాని కూడా లేని రాష్ట్రం అయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎందుకు అంత క‌క్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారో ఇప్ప‌టికీ ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు.

ఎందుకు మంకుప‌ట్టు ప‌ట్టి ఇలా చేస్తున్నారో అంతుప‌ట్ట‌కుండా ఉంది.

తెలుగుదేశం పార్టీతో రాజ‌కీయ విభేదాలు ఉంటే అది ఆ పార్టీకి బిజెపి మ‌ధ్య ఉండాలి కానీ ప్ర‌జ‌ల సెంటిమెంటుతో చెల‌గాటం ఆడ‌టం దారుణ‌మైన విష‌యం.

తెలుగుదేశం పార్టీ కూడా ముందు నుంచి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌కుండా కేంద్రాన్ని దేబెరిస్తూ ఉండిపోవ‌డం కూడా చాలా మందికి న‌చ్చ‌డం లేదు.

కేంద్ర ప్ర‌భుత్వం నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యాన్ని ముందే గ‌మ‌నించి రాజ‌కీయ వ‌త్తిడి తీసుకురావ‌డంలో తెలుగుదేశం పార్టీ వెనుక‌బ‌డిపోయింది.

త‌మ మిత్ర ప‌క్షాలు లేని రాష్ట్రాల‌కు కూడా వ‌రాలు గుప్పించే న‌రేంద్ర మోడీ మిత్ర ప‌క్షం ప‌రిపాలిస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను మాత్రం న‌ట్టేట్లో ముంచేశారు.

తెలుగుదేశం పార్టీ ఆ రాష్ట్రంలో త‌లెత్తుకోకుండా చేశారు.

ఇలా చేయ‌డం ద్వారా బిజెపి ఏం సాధించిందో అర్ధం కావ‌డం లేదు. మిత్ర ప‌క్షాల‌ను దూరం చేసుకుంటూ వెళుతున్న బిజెపి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా కోల్పోయే ప‌రిస్థితి తెచ్చుకుంది.

రానున్న కాలంలో చంద్ర‌బాబునాయుడు జాతీయ స్థాయి రాజ‌కీయాల‌లోకి వ‌స్తే త‌న‌కు ఇబ్బంద‌ని మోడీ భావించారా? అందుకే ఆయ‌న‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో దూరం జ‌రిగారా?

తెలియ‌దు. కేంద్రం ఇచ్చిన సాయాన్ని చంద్ర‌బాబునాయుడు దుర్వినియోగం చేశారా?

అలాగైతే నేరుగా కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఒక కార్పొరేష‌న్ పెట్టి లేదా ఒక క‌మిష‌న్ ఏర్పాటు చేసి లేదా ఒక స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ ఏర్పాటు చేసి నేరుగా నిధులు ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు.

అలా చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఆదుకోవ‌చ్చు. అయితే ఇవేవీ కేంద్రంలోని న‌రేంద్ర‌మోడీ చేయ‌లేదు. ఇవ‌న్నీ కాకుండా చంద్ర‌బాబునాయుడిని అణ‌గ‌దొక్కాల‌నుకున్నారా?

రాజ‌కీయంగా ఏ పార్టీ ఏం చేసుకుంటుందో ప్ర‌జ‌ల‌కు సంబంధం లేదు. అయితే ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను శిక్షంచ‌కూడ‌దు. చంద్ర‌బాబునాయుడిపై బిజెపికి కోపం ఎందుకు? ఎందుకు కోపం ఉందో ప్ర‌జ‌ల‌కు అన‌వ‌స‌రం.

ఆయ‌న‌పై కోపం ఉంటే రాజ‌కీయంగా చూసుకోవాలి కానీ ప్ర‌త్యేక హోదా లేదా ప్ర‌త్యేక ప్యాకేజి ఇవ్వ‌కుండా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్ట‌డం అన్యాయం.

చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయంగా బ‌ల‌ప‌డితే రానున్న రోజుల్లో మూడో ప్ర‌త్యామ్నాయం ఏర్పాటు చేస్తార‌నే భ‌యం ఉంటే అది రాజ‌కీయంగా తేల్చుకోవాలి. ఇవేవీ చేయ‌కుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను అన్యాయం చేయ‌డం దారుణ‌మైన విష‌యం.

ఎన్నిక‌ల సమ‌యంలో ప్ర‌త్యేక హొదా ఇస్తామ‌ని చెప్పింది న‌రేంద్ర మోడీ కాదా? దాన్ని తెలుగులో త‌ర్జుమా చేసింది వెంక‌య్య నాయుడు కాదా?

రాజ్య‌స‌భ‌లో ప్ర‌త్యేక హోదా కోసం డిమాండ్ చేసింది అరుణ్ జైట్లీ కాదా? ఈ ముగ్గురు రాజ‌కీయంగా ఉన్న‌త స్థానానికి వెళ్లింది ప్ర‌జ‌ల ఓట్ల‌తో కాదా?

దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వుల్లో ఉన్న ఈ ముగ్గురు ఇచ్చిన హామీలు మ‌ర‌చిపోవ‌డం ఎంత వ‌ర‌కు సమంజ‌సం?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని బిజెపి త‌న ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో చెప్ప‌లేదా? ఇవ‌న్నీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు మ‌ర‌చిపోలేని విష‌యాలు.

ప్ర‌త్యేక హోదా కాకుండా ప్ర‌త్యేక ప్యాకేజీకి కూడా చంద్ర‌బాబునాయుడు అంగీక‌రించారు. ప్ర‌జ‌ల‌కు వివ‌రించి చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

అయినా అందుకు సంబంధించిన ఉత్త‌ర్వులు కూడా ఇవ్వ‌లేక‌పోయారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని పార్ల‌మెంటు త‌లుపులు మూసి విభ‌జించడం క‌న్నా ఘోర‌మైన త‌ప్పును బిజెపి చేసింది.

ఆ నాడు రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్ పార్టీ క‌నీసం తెలంగాణ ప్ర‌జ‌ల‌నైనా సంతృప్తి ప‌ర‌చింది. ఇప్పుడు బిజెపి అంద‌రిని నైరాశ్యంలోముంచుతున్న‌ది.

ఇప్ప‌టికీ ఎన్ డి ఏ నుంచి బ‌య‌ట‌కు రాకుండా తెలుగుదేశం పార్టీ త‌న ప‌రువును కోల్పోతున్న‌ది.

Leave a Reply