ఒకరుపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకున్న టీడీపీ-వైసీపీ నేతలు

tdp former mla ready join to ysrcp
Share Icons:

అమరావతి:

ఏపీలో రోజు టీడీపీ-వైసీపీ నేతల ఏదొకవిధంగా ఒకరుపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఇక ఎప్పటి మాదిరిగానే ఈరోజు కూడా నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మొదట వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు-పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శలు చేశారు.   తెలుగుదేశం పార్టీ చేతిలో పవన్ కల్యాణ్ ఓ కీలుబొమ్మలా మారిపోయారని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు పెట్టారు.

“ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన దురాగతాల పట్ల స్పందించకుండా పవన్ కల్యాణ్ జ్ఞానిలా మౌనంగా వున్నారు. ఇప్పుడు టీడీపీ గేమ్ ప్లాన్ లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్నారు. పవన్ చంద్రబాబు చేతిలోని మనిషి అన్న విషయం బహిరంగ రహస్యమే” అని అన్నారు. ఆపై “ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వసూలయ్యే పన్నును ఆదా చేసేలా సాగుతున్నాయి. పారదర్శకతపై దేశానికే ఆదర్శంగా నిలిచి, ఓ దిశను చూపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో చౌకబారు ప్రచారం కోసం కాకుండా పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు ఏదైనా విమర్శలు చేసేటప్పుడు ముందూ, వెనుకా ఆలోచించాలి” అని కూడా విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.

అటు వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లకు విశేష ప్రజాదరణ లభించడం తెలిసిందే. అయితే, జగన్ సర్కారు వచ్చాక అన్న క్యాంటీన్లను మూసివేస్తున్నారంటూ టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఇదే అంశంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 204 అన్న క్యాంటీన్లు మూతపడ్డాయని, చంద్రబాబునాయుడు ప్రారంభించిన ప్రభుత్వ పథకాలను ఆపేసి పేదవాళ్ల కడుపుకొట్టడం అన్యాయం అని ట్వీట్ చేశారు. ఆకలికి రాజకీయం తెలియదని నారా లోకేశ్ గారు అన్న మాట నిజమేనని పేర్కొన్నారు. పేదవాడి బాధను గుర్తించలేని నాయకులు, ప్రభుత్వం ఎందుకు? అంటూ మండిపడ్డారు.

ఇక తెలంగాణలో టీడీపీ ఖాళీ అయినట్లేనని, ఏపీలోనూ ఖాళీ కాబోతోందని వైసీపీ నేత సి.రామచంద్రయ్య జోస్యం చెప్పారు. మరో ముప్పై ఏళ్లపాటు వైసీపీ అధికారంలో ఉంటుందని భావించిన చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని అన్నారు. సీఎం జగన్ వంద రోజుల పాలనపై చంద్రబాబు వంద అబద్ధాలు, 101 కుట్రలు చేశారని, టీడీపీ నేతలను హత్య చేశారని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ పై చంద్రబాబు ఫైర్

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచే జగన్ అరాచకాలను ప్రారంభించారని చంద్రబాబు విమర్శించారు. ఏ కొత్త ప్రభుత్వమైనా తొలి వంద రోజుల్లో ఒక దశాదిశను ఏర్పాటు చేసుకుంటుందని… వైసీపీ ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లో ప్రజల్లో అప్రతిష్టపాలైందని అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాన్ని రివర్స్ చేశారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని చంపేసే స్థితికి తెచ్చారని అన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ తో ముందుకు వెళ్లే ప్రాజెక్టును దెబ్బతీశారని చెప్పారు.

Leave a Reply