వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీ నేతల ఫైర్…

war words between tdp,ysrcp and bjp leaders in ap
Share Icons:

అమరావతి:

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వివిధ సందర్భాల్లో బీజేపీ, టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ…జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పాలనపై ముఖ్యమంత్రి జగన్ పట్టు కోల్పోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధికి స్థానం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ చెప్పిన మాటలకు… ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉందని అన్నారు.

ఇక రివర్స్ టెండరింగ్ పేరుతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నారని, పోలవరం విషయంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. మార్పును కోరుకున్న ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారని… వచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నారని కన్నా చెప్పారు. గత ఐదేళ్ల గురించి మాట్లాడటం మినహా… ప్రస్తుతం ఏమిటనేది చెప్పడం లేదని విమర్శించారు.

రోజురోజుకు రాష్ట్ర పరిస్థితి దిగజారుతోందని చెప్పారు. ప్రబుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో జగన్ అవగాహనారాహిత్యం కనిపిస్తోందని తెలిపారు. ఒక మతానికి ప్రాధాన్యతను ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. జన్మభూమి కమిటీల పేర్లను మార్చి గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చారని కన్నా అన్నారు. వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ముతో ఉద్యోగాలిచ్చే వ్యవస్థను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ సొంత పార్టీ కార్యకర్తలకు ఉపాధి మాత్రమేనని అన్నారు.

మీరు కల్పించిన ఉద్యోగాల కంటే ఎక్కువ మందిని రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇసుక మాఫియాను అరికడతామని చెప్పి, ఇసుకే లేకుండా చేశారని అన్నారు.

100 రోజుల పాలనలో ప్రజల కోసం వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు. తుగ్లక్ పాలన ఎలా ఉంటుందో 100 రోజుల్లో చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కంటే మెరుగైన పాలన అందిస్తారనే ఆకాంక్షతో జగన్ కు ప్రజలు అధికారాన్ని అప్పగించారని…. ప్రజల నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. పెన్షన్ ను రూ. 250 పెంచడం మినహా ఏం చేశారని ప్రశ్నించారు.

ఏపీలో వైసీపీ వంద రోజుల పాలనలో పల్నాడు ప్రాంతంలో ఎన్నో అరాచకాలు జరిగాయని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దాడులకు గురైన టీడీపీ బాధితుల శిబిరాన్ని గుంటూరులో ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా యరపతినేనిని మీడియా పలకరించింది. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో వైసీపీ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ మద్దతుదారుల ఇళ్లు కూలగొట్టారని, వందలాది కుటుంబాలు గ్రామాలు విడిచి పెట్టి వెళ్లిపోయే పరిస్థితి నెలకొందని అన్నారు.

 

Leave a Reply