పాత్రికేయుడుగా ప్రకాశం పంతులు! నేడు 149వ జయంతి!

Share Icons:
  • ‘తెల్లదొరల తుపాకి గుళ్ళకు నేలకొరింగిన విప్లవజ్యోతి ఒక తెలుగు వాడు’ -అల్లూరి
  • ‘అవే తుపాకి గుళ్ళకు గుండెలెదురొడ్డి బ్రిటిషు వారి గుండెలదరగొట్టిన మరో తెలుగు సింహం’ -టంగుటూరి
  • బానిసల మాదిరి భజనలు చేయని ధీరోదాత్తులు వారు 
  • అదీ తెలుతేజమంటే.. పౌరుషమంటే..ఆత్మగౌరవమంటే..

సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, ఆంధ్రకేసరి.. టంగుటూరి ప్రకాశం పంతులు, ఆగష్టు 23, 1872 ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెంలో సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించారు.

 

ప్రకాశం పంతులు 1921 అక్టోబరు 29న స్వరాజ్య పత్రిక స్థాపించారు. పత్రిక అనతికాలంలోనే ప్రజాభిమానాన్ని సంపాదించింది. 1930 వరకూ ప్రచురణ పొందిన పత్రిక ఉప్పు సత్యాగ్రహం నేపథ్యంలో ప్రభుత్వ నిర్బంధాలకు లోనైంది. పత్రికను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు బ్రిటీష్ ప్రభుత్వం భారీ ధరావతు సొమ్ము చెల్లించాలని నిర్దేశించింది. అప్పటికే పత్రికా నిర్వహణ వల్ల ఆర్థికంగా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రకాశం పంతులు ఆ డబ్బును సమకూర్చుకోలేక పత్రికను మూసివేయాల్సి వచ్చింది. 1931లో గాంధీ-ఇర్విన్ ఒప్పందంలో భాగంగా పత్రికపై ఒత్తిళ్లు, నిర్బంధాలు సడలడంతో స్వరాజ్య పత్రికను మళ్ళీ  ప్రారంభించారు. ఐతే ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకావడంతో తప్పనిసరి పరిస్థితుల నడుమ ఈ పత్రికను మూసేశారు. 1935లో పత్రికను పునః ప్రారంభించేందుకు కొన్ని విఫలయత్నాలు చేశారు.

 

టంగుటూరి ప్రకాశం పంతులు పత్రికను నిర్వహించేందుకు ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. 1920 నాటికి తెలుగు, తమిళ ప్రాంతాల్లో ప్రఖ్యాతి పొందిన న్యాయవాదిగా, ఆ రోజుల్లోనే నెలకు దాదాపుగా లక్ష వరకూ సంపాదించిన ప్రకాశం అంతటి అపార ధనసంపదలు లాభాపేక్ష లేకుండా ఈ పత్రికను నిర్వహించి ప్రజలను చైతన్యపరిచే క్రమంలో సమిధలుగా సమర్పించారు.  పొలాలు, తోటలు, ఇళ్లు, నగదు, బంగారం రూపేణా ఎంతో సొమ్ము కూడబెట్టిన టంగుటూరి ఈ పత్రిక నిర్వహణలోనే ఆ డబ్బు అంతా కోల్పోయారు. “స్వరాజ్య” పన్నేండేళ్ళు నడిచింది. లక్షల్లో అప్పులు చేశారు ప్రకాశంగారు. తన బంగళాలను అమ్మి అప్పులు తీర్చారు.

 

స్వరాజ్యలో జి.వి. కృపానిధి సహాయ సంపాదకునిగా పనిచేసారు. ఖాసా సుబ్బారావు, కోటంరాజు పున్నయ్య…. మొదలైన గొప్ప పాత్రికేయులు ‘స్వరాజ్య’ లో పనిచేశారు. తమిళులు స్థాపించిన ‘హిందూ’ పత్రిక ‘స్వరాజ్య’ ను తొక్కివేసేందుకు ఎన్నో ప్రయత్నాలు  చేసిందన్న అభియోగాలుకూడా ఉన్నాయి .  ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించేవారాయన.

 

ప్రకాశం పత్రికా నిర్వహణ గురించి తన ఆత్మకథలో మహాత్మా గాంధీ పత్రికానిర్వహణలో డబ్బు కోల్పోవద్దనీ, ఆర్థికపరమైన ఇబ్బందుల దృష్ట్యా పత్రిక మూసేయమని చెప్పినా తాను పట్టువీడక పత్రికను కొనసాగించానని రాసుకున్నారు.

 

“గాలితో నైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం” అనేవారు అయ్యదేవర కాళేశ్వరరావు.  ప్రకాశం, లా టైమ్స్ అనే న్యాయవాద పత్రికకు కూడా సంపాదకత్వం వహించేవారు.

-నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply