తాడిపత్రి పోరు: జేసీ వర్సెస్ కేతిరెడ్డి..

Share Icons:

అనంతపురం, 22 మార్చి:

తాడిపత్రి నియోజకవర్గం జేసీ కుటుంబం అడ్డా…ఇక్కడ జరిగిన అన్నీ ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డిదే విజయం. అయితే 2014లో దివాకర్ అనంతపురం ఎంపీగా…సోదరుడు ప్రభాకర్ తాడిపత్రి నుండి తెదేపా తరుపున పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో వారి కుమారులు అనంతపురం ఎంపీగా జేసీ పవన్..తాడిపత్రి నుండి జేసీ అస్మిత్ పోటీ చేస్తున్నారు. మరి ఈసారి జేసీ ఫ్యామిలీ విజయం అంత సులువు కాదనే చెప్పాలి.

వైసీపీ నుంచి కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి సోదరుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలోకి దిగారు. అయితే పెద్దారెడ్డి ఇటీవలే బైపాస్‌ సర్జరీ చేసుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ ముఖ్యమైన కార్యక్రమాలకే హాజరవుతున్నారు. ఆయన తరఫున కుమారులు హర్షవర్ధన్‌రెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అటు పేరుకు టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి అయినా తండ్రి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

ఇక అస్మిత్‌కి..ఉన్నత విద్యావంతుడు కావడం, కుటుంబం అండ ఉండటం, తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి పాయింట్లు ప్లస్. కానీ తండ్రి సూచనలకు అనుగుణంగా పనిచేయడం, నిర్ణయాలు తీసుకోవడం, అసంతృప్తితో పలువురు పార్టీని వీడటం మైనస్ కానున్నాయి. అటు పెద్దారెడ్డికి టీడీపీ నుంచి పలువురు నాయకులు వలస రావడం ప్లస్ కానున్నాయి. కానీ స్థానికేతరుడు కావడం, ఫ్యాక్షనిస్టు, రౌడీషీటర్‌ అనే గుర్తింపు, పోలీస్‌ కేసులు ఉండటం మైనస్.

ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 40వేల రెడ్డి ఓట్లు ఉన్నాయి. ప్రస్తుత టీడీపీ, వైసీపీ అభ్యర్థులిద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే. ఇక్కడ జేసీ ఫ్యామిలీకి అన్నీ వర్గాల్లో మంచి ఆదరణ ఉంది. ఇక వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మరి చూడాలి జేసీ ఫ్యామిలీ మళ్ళీ పాగా వేస్తుందో లేక వైసీపీ జెండా పాతుతుందో..

మామాట: జేసీ అడ్డాలో వైకాపా జెండా ఎగరగలదా

Leave a Reply