సినిమా కబుర్లు: కష్టాల్లో సైరా…వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అతిథిగా వెంకీ

syeraa movie news and venkatesh cheif guest for varun tej valmiki pre release event
Share Icons:

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచో వచ్చిన పోస్టర్లు, ట్రైలర్లు అభిమానులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది.

అయితే చిత్రాన్ని కొన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు ఈరోజు హైదరాబాదులోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సినిమా తీసే సమయంలో సినిమాకు అవసరమైన సమాచారాన్ని తమ నుంచి తీసుకున్నారని… షూటింగ్ కు అవసరమైన లొకేషన్స్, నరసింహారెడ్డి జీవితం గురించి తెలుకున్నారని ఈ సందర్భంగా వారు చెప్పారు.

అయితే తమకు న్యాయం చేస్తామని ఆ సమయంలో చిరంజీవి హామీ ఇచ్చారని, కానీ, ఇంతవరకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన గురించి సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు వెళ్లి, వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్

వరుణ్ తేజ్ హీరోగా…హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్మీకి… ఈ చిత్రం ఈ నెల 20న విడుదల అవ్వడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 15వ తేదీన హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ చిత్రానికి హీరో వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. వెంకీ, వరుణ్ ల కాంబినేషన్లో ఆమధ్య వచ్చిన ‘ఎఫ్ 2’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వరుణ్ చిత్రానికి వెంకటేశ్ తన వంతుగా ప్రమోషన్ చేస్తున్నారు. ‘వాల్మీకి’ చిత్రంలో వరుణ్ సరసన పూజా హెగ్డే నటించింది.

గ్యాంగ్ లీడర్ పై నాని ట్వీట్

నాని హీరోగా ,విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి…మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో హీరో నాని ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో నిన్న ‘సినిమా హిట్టయితే నిద్రలేపండి. లేదంటే డిస్టర్బ్ చేయొద్దు’ అంటూ సీనియర్ నటి లక్ష్మి భుజంపై నిద్రపోతున్న ఫొటోను నాని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

తాజాగా హీరో నాని తనకూ, సీనియర్ నటి లక్ష్మీకి మధ్య సంభాషణ జరుగుతున్నట్లు సరదాసరదాగా ఓ ట్వీట్ చేశాడు. అందులో నాని మాట్లాడుతూ.. ‘ఏంటి బామ్మా?.. ఇంత వయొలెంట్ గా  లేపేశారు?’ అని  అడిగితే, లక్ష్మి స్పందిస్తూ..‘ఒకసారి ట్విట్టర్ లో నీ మెన్షన్స్ చూసుకో’ అని జవాబిచ్చినట్లు ఓ ఫన్నీ ట్వీట్ చేశాడు.

 

Leave a Reply