సంస్కృతి, దేశభక్తి, జాతీయ భావం – ప్రతి రూపం : స్వామి వివేకానంద జయంతి నేడే 

Share Icons:

సంస్కృతి, దేశభక్తి, జాతీయ భావం – ప్రతి రూపం : స్వామి వివేకానంద జయంతి నేడే 

చైతన్య దీప్తి – యువతకు స్ఫూర్తి.. ఆయనే వివేకానంద

స్వామి వివేకానంద భారత దేశానికే కాదు యువప్రపంచానికే ఒక దివ్య తేజం. మతానికి కొత్త అర్థాన్ని, సేవకు పరమార్థాన్ని నిర్వచించి నరుడే నారాయణుడని, మానవసేవయే మాధవసేవ అని చాటిచెప్పిన మహోన్నత మూర్తి స్వామి వివేకానంద దేశ యువతకు సదా స్ఫూర్తిదాత. “బలమే జీవనం బలహీనతే మరణం” అని వివేకానంద ప్రవచనం జగద్విఖ్యాతం. యువతకు స్పూర్తిగా, చైతన్య దీప్తిగా భాసిల్లిన వివేకానంద విలక్షణ జీవనశైలి, విశిష్ఠమైన ఆయన సేవలు నేటి యువతకు మార్గదర్శకం, ఆదర్శనీయం, అవశ్యనీయం. వివేకానందుని పుట్టినరోజును జాతీయ యువజనదినోత్సవంగా ప్రకటించారు. 1863 జనవరి 12న కలకత్తాలో విశ్వనాధ దత్తా, భువనేశ్వరి దంపతులకు జన్మించిన వివేకానందుని తొలినామం నరేంద్రుడు.

ప్రపంచంలో అతి ప్రాచీన సంస్కృతి భారతీయ సంస్కృతి, యుగ యుగాల హిందూ విజ్ఞాన సంకలనమే ఈ మహోన్నత సంస్కృతి అని చాటిచెప్పి, అనాదిగా ఎన్నో అవాంతరాలను తట్టుకుని ఉత్కృష్ట స్థానం పొంది నూతన తేజస్సుతో ప్రపంచ నలుమూలలా కీర్తి పతాకాన్ని రెపరెప లాడించిన మహా సంస్కృతీ రూపమే వివేకానందుడు. భారతీయ సంస్కృతిని, దేశభక్తిని, జాతీయ భావాన్ని ప్రతి ఎదలో ప్రతిధ్వనించేట్లు, ప్రతినిత్యం స్మరించేట్లు ప్రచారం చేసి యావత్‌ జాతినంతా మేల్కొలిపిన మహనీయుడు ఆయన. వివేకానందుని ప్రసంగాలు యుగయుగాలకు స్పుర్తిదాయకం. ఆయన యువతలోని శక్తిని మేల్కోలిపారు. ఆయన ప్రసంగాలు విదేశీయులను సైతం ఆకట్టుకున్నాయి. ఆయన ఓ ప్రచార కర్త కాదు. ఓ మతం. ప్రతి మనిషి ఆత్మలో దైవత్వన్ని చూడడం ఆ మత సూత్రం. పేదవాడి సేవే భగవంతుని సేవ అని చాటి చెప్పిన యుగకర్త. భారతదేశం మళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పోందాలని ఆశించిన వారిలో ముఖ్యుడాయన.

వివేకానందుని గురించి తెలియని భారతీయుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. యువతకు స్పూర్తి దాయకుడైన వివేకానందుడు అందరికీ ఆదర్శమే. ఎన్నో అధ్యాత్మిక అనుభవాలు చివరికి అత్యున్నతమైన అద్వైత స్థితి కూడా పొందిన మహనీయుడు. బాల్యం నుంచే ఆయనలో ధైర్య సాహసాలు, నిరుపమాన దీక్షాశక్తి, అద్భుత ధారణ శక్తి ప్రస్ఫుటమయ్యాయి. కళాశాలలో చదువుతుండగా తండ్రి విశ్వనాధ దత్త మరణించటంతో కుటుంబ భారం ఆయన భుజాలపై పడింది. చిన్నప్పటి నుంచి నరేంద్రుడి కలల్లో ఒక దివ్య శక్తి వెలుగు రూపంలో కనిపించేది. ఆ పరిస్థితుల్లో దక్షిణేశ్వరంలోని రామకృష్ణ పరమహంసతో పరిచయమేర్పడింది. అనతి కాలంలోనే నరేంద్రుడు రామకృష్ణుని ముఖ్య శిష్యుడైయ్యారు. ఆయన మనోహర గానమాధుర్యం రామకృష్ణుని ఆనందసాగరంలో ముంచెత్తేది. 1886 లో పరమహంస నిర్యాణం అనంతరం నరేంద్రుడు పరివ్రాజకుడుగా యావద్బారత పర్యాటన చేశారు. వివేకానంద నామం స్వీకరించారు. దేశ సముద్దరణకు, భారతజాతి పునరుజ్జీవనానికి అహర్నిశలు తపించారు.

వివేకానంద గొప్ప ఉపన్యాసకుడు. ఆయన ప్రసంగం ఎంతటివారినైనా అలరించేది. వివేకానందుని ఆ రోజులలో “లైట్నింగ్ ఆరేటర్” అని పిలిచేవారు. 1893 సెప్టెంబరు లో అమెరికాలోని చికాగోలో జరిగిన మహాసభల్లో అయన చేసిన ప్రసంగం ఈ రోజుకూ ప్రపంచదేశాలంతటా ప్రతి ధ్వనిస్తునే ఉన్ది. చికాగో సభలో హిందూ వేదాంత భేరిని మ్రోగించిన వివేకానంద వాక్పటిమకు అనంతమైన మేధా సంపత్తికి శ్రోతలు ముగ్దులయ్యారు. నగర వీధులలో వివేకానందుని నిలువెత్తు చిత్రపటాలు వెలిశాయి. ఆయన మహోపన్యాసం హిందూ ఝంఝూమారుతమని, ఆయన ఈశ్వర ప్రేరిత ప్రవక్త అని పత్రికలు శ్లాఘించాయి. నాలుగు సంవత్సరాల పాటు అమెరికా, ఐరోపా ఖండాలలో పర్యటించి, అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చి, వేదాంత కేంద్రాలు నెలకొల్పి, అనేకులను శిష్యులుగా స్వీకరించి 1897లో స్వదేశానికి తిరిగి రాగానే వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపించారు. భారతదేశంలో నూతన శకం ప్రారంభమైంది.

ఆయన గొప్ప దేశభక్తుడు. యువతరాన్ని ప్రేరేపించిన మహాశక్తి, గొప్ప వ్యక్తి. భారతదేశ ఘనత వర్ణిస్తూ ఆయన, “ఇక్కడనే ఈ ఒక్క దేశంలోనే మానవ హృదయం అతి విశాలమై అనంత విస్తృతిని పొంది తోటి మానవ జాతినే కాక పశుపక్ష్యాదులతో సహా సమస్త ప్రాణికోటి చేత సర్వజగత్తు ఉచ్ఛనీచాలు లేకుండా తనతోనే వున్నట్లు భావన చేయగలిగింది” అన్నారు. మానవునిలో లోపాలు వివరిస్తూ “మనంతట మనం పని చేయం, పనిచేసే వారిని పనిచేయనీయం, వారిని విమర్శించి తప్పులెంచి అవహేళన చేస్తాం. మానవ జాతిపతనానికి ముఖ్యమైనదీ లక్షణమే” అన్నారు. దైవ విశ్వాసం కంటె మానవ విశ్వాసం ముఖ్యమని బోధిస్తూ “మూడు వందల ముఫై కోట్ల దేవతలలోనూ నమ్మకమున్నా నీలో నీకే విశ్వాసం లేకపోతే నీకు ముక్తి లేదు. దేశ ప్రజలందరికి ఆత్మవిశ్వాసం క్రియా శూరత్వం కావాలి. ఈ అవసరం నాకు స్పష్టంగా కనిపిస్తుంది “అని చెప్పారు. అంతేకాక “మనం సోమరులం, ఏ పని చేయలేం, ముందు మనమంతా సోమరితనం వదిలి కష్టించి పనిచేయటం అలవర్చుకోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది” అని ఆయన బొధించారు.

“నా దేశంలో పస్తున్న ప్రతి ప్రాణికి ఆహారం పెట్టి రక్షించటమే నా పరమధర్మం. ఇదే నా మతం. తద్భిన్నమంతా ఆదర్శమే, కృత్రిమ ధర్మమే. నిరుపేదయైన నా భారత నారాయణుని – నా యిష్టదేవతలను అర్చించటానికి ఎన్ని జన్మలైనా ఎత్తగలను, ఎన్ని బాధలైనా ఓరుస్తాను – అని ప్రకటించారాయన. 1902 జులై 4న, 39వయేట బేలూర్ మఠంలో ఆయన తనువు చాలించారు. అన్నదాన, విద్యాదాన, జ్ఞానదానాలచే ప్రజాసేవ చేస్తూ యావద్భారతంలోనే కాకుండా ప్రపంచమంతటా ప్రఖ్యాతి వహించిన శ్రీ రామకృష్ణ మఠసేవా సంఘాల్ని స్థాపించిన ఘనత వివేకానందుడికే దక్కుతుంది.

-నందిరాజు రాధాకృష్ణ

నరేంద్ర చిత్ర సంచితం తిలకించండి..

Leave a Reply