సాంఫిుక సాహిత్యోద్యమ కృషీవలుడు సురవరం. 

Share Icons:

సాంఫిుక సాహిత్యోద్యమ కృషీవలుడు సురవరం. 

తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన సురవరం ప్రతాపరెడ్డి  ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు.

కనీసమైన మానవ హక్కులు లేక, నవాబు, నిరంకుశత్వంలో అలమటిస్తున్న తెలంగాణా ప్రజానీకాన్ని చైతన్యవంతంగా తీర్చిదిద్దిన తెలంగాణ వైతాళికులు ముగ్గురు మనకు సదాస్మరణీయులు. వారు కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి. చీకటిలో కొట్టుమిట్టాడుతున్న తెలుగు వారికి ముఖ్యంగా తెలంగాణాకు వెలుగును పంచిన మహనీయులలో ఎన్నదగినవారు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన  1896 మే 28 తేదీన గద్వాల సంస్థానంలోని ‘ బోరవెల్లి’   గ్రామంలో   అమ్మమ్మ  ఇంట్లో జన్మించారు.  స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా అలంపురం తాలూకాలోని ‘ ఇటికలపాడు ‘. తల్లి రంగమ్మ. తండ్రి నారాయణ రెడ్డి. దాతగా విద్యాభిమానిగా పేరుగాంచిన పినతండ్రి  రామకృష్ణారెడ్డి  వద్ద కర్నూలులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. వెల్లాల శంకరశాస్త్రి  వద్ద సంస్కృత కావ్యాలు, వ్యాకరణం చదువుకొన్నారు. నిజాం కాలేజీలో ఎఫ్.ఎ. మద్రాసు ప్రెసిడెన్సి కాలేజిలో బి.ఏ. చదివిన తర్వాత బి.ఎల్. చదివి న్యాయవాద వృత్తిని చేపట్టారు. కాని  ఎంతో కాలం ఆ వృత్తిలో ఉండలేకపోయారు.

దేశంలో గాంధీజీ నాయకత్వంలో సాగుతున్న స్వాతంత్ర్యపోరాటం వారిని ఆకర్షించింది. తెలంగాణా ప్రజల దైన్యం, దారిద్ర్యం, ప్రాథమిక హక్కులను కూడా నోచుకోని దుస్థితి చూచి చలించి పోయారు ప్రతాపరెడ్డి. మాతృభాషలో చదువుకొనే అవకాశాలు లేవు. అంతా ఉర్దూమయం. నిజాం నిరంకుశ పరిపాలన. నిద్రాణమైన తెలంగాణాను జాగృతం చేయాలని దీక్ష వహించారు. ప్రతాపరెడ్డి భావుకుడైన రచయిత. సురవరం ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. అప్పుడు రాజభాషగా, పాలనా భాషగా,వ్యవహారభాషగా ఉర్దూ ఉన్నది. అప్పటి రాజభాష ఉర్దూ భాషలోనే మీజాన్, జామీన్, రయ్యత్ పత్రికలు వచ్చేవి. అప్పటికి రెండు తెలుగు వార పత్రికలు మాత్రమే ‘నీలగిరి’నల్లగొండ జిల్లా నుండి,‘తెలుగు’వరంగల్ జిల్లా నుంచి వెలువడుతుండేవి.

ఆనాటి నైజాంలో తెలుగు భాషకు, సంస్కృతికి పట్టుగొమ్మగా ఉన రాజా బహదుర్ పింగళి వెంకటరామారెడ్డి. ప్రతాపరెడ్డి ని 1924లో హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ కార్యదర్శిగా నియమించారు. వెంకటరామారెడ్డి  కొత్వాలుగా ఉండేవారు. ప్రతాపరెడ్డి హాస్టల్ విద్యార్ధులలో క్రమశిక్షణ నెలకొల్పి వారిని చైతన్య వంతులను కావించారు. పేరుకు రెడ్డి హాస్టల్. కాని అన్ని కులాల వారికి ప్రవేశం ఉండేది. హైదరాబాద్ సంస్థానంలోని తెలుగు ప్రజల విజ్ఞానానికి తెలుగులో పత్రికను ప్రారంభించాలని నిశ్చయించారు. హాస్టల్ కార్యదర్శి పదవిని మానుకొన్నారు. రాజా బహదుర్ ఆశీస్సులతో 1926 మే 10వ తేదీన ‘గోలకొండ’ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక వారానికి రెండు మార్లు వెలువడుతుండేది.  1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ‘ఆంధ్ర మహాసభ’కు అధ్యక్షత వహించారు.ఆంధ్ర మహాసభ కార్యాకలాపాలన్ని తెలుగులోనే జరగాలంటూ తీర్మానం చేయించారు.

 పత్రికలోని ఒక సంపాదకీయంలో “మేము మా పత్రికాస్థాపన కాలం నుండి రెండు అంశాలను దృష్టిపథంలో ఉంచుకొని దేశీయుల సేవ చేస్తున్నాము. మొదటిది ఆంధ్ర భాషా సేవ, రెండవది జాతి, కుల వివక్షత లేక నిష్పక్షపాతముగా ఆంధ్రులలో సర్వశాఖల వారి యొక్క సత్వరాభివృద్ధికి పాటుపడుట” అని వ్రాసి పత్రిక ఆశయాలను వెల్లడించారు. పత్రికా నిర్వహణలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. జాతీయ భావాలను ధైర్యంగా ప్రచారం చేశారు. 1947 లో అది దినపత్రికగా మారింది. పోలీస్ చర్య వరకు ప్రతాపరెడ్డి  ‘గోలకొండ’ పత్రికా సంపాదకులుగా పనిచేసారు. వారి తర్వాత నూకల నర్వోత్తమ రెడ్డి , రాజా రామేశ్వరరావు   కొన్నాళ్ళు పత్రికను నిర్వహించారు. 1966 వరకూ పత్రిక నడిచింది. కొంతకాలం దేవులపల్లి రామానుజరావు  కూడా సంపాదకులుగ పనిచేశారు.

ప్రతాపరెడ్డి  సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఆంగ్లభాషలలో గొప్ప పండితులు. కాశీనాథుని నాగేశ్వరరావు , తెలుగు దేశంలొ మొట్టమొదటి రాజకీయ ఖైదీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు  సురవరం వారికి స్నేహితులు. ఆ కాలంలో సభలు సమావేశాలు జరుపుకొనడం చాలా కష్టం. ఆ పరిస్థితిని ‘ వాగ్బంధన శాసన శృంగార తాండవ విశేషం ‘ అన్నారు ప్రతాపరెడ్డి . 1951 లో ప్రతాపరెడ్డి పులిజాల హనుమంతరావు తో కలిసి ‘ప్రజావాణి’ దినపత్రికను స్థాపించి రెండేళ్ళు నడిపారు. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి పట్ల ప్రగాఢమైన అభిమానం ఉండేది. ప్రజలలో విజ్ఞాన వికాసానికి గొప్ప రచనలు చేశారు. గొప్ప పరిశోధకులుగా, కవిగా, నవలా రచయితగా, కథారచయితగా, సాహిత్య విమర్శకులుగా  సుప్రసిద్ధులు. తెలంగాణా ప్రజల భాషనుకాని, సంస్కృతినిగాని తక్కువ చేసి మాట్లాడితే సహించేవారు కాదు.

“బ్రిటిష్ ఆంధ్రులు బ్రౌణ్యాంధ్రం (ఇంగ్లీష్ తెలుగు) మాట్లాడితే మేము తారక్యాంధ్రం (ఉర్దూ తెలుగు) మాట్లాడుతాము. వారిది ఇంగ్లీష్ దడదడ, మాది ఉర్దు గడబిడ” అనేవారు. ముడుంబ వెంకట రాఘవాచార్యులు “తెలంగాణాలో కవులు లేర”న్నారట. ప్రతాపరెడ్డి వారికి తగిన సమాధానం చెప్ప నిశ్చయించి నాలుగు నెలల్లో 354 కవుల జాబితా, వివరాలతో ‘గోల్కొండ కవులు’ అను గొప్ప సంచికను ప్రచురించారు. అదీ వారి పట్టుదల.

సురవరం దాదాపు 40 గ్రంథాలు రచించారు. నిజాం రాష్ట్ర పాలన, మొగలాయి కథలు, సంఘోద్ధరణ, ఉచ్చల విషాదము, గ్రంథాలయము, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, యువజన విజ్ఞానం మొదలైన గ్రంథాలను రచించారు. వారి రచనలలో ప్రధానంగా పేర్కొనదగినవి రామాయణ విశేషాలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, దక్షిణ భారతదేశంలో సాంఘిక చరిత్ర వ్రాసిన వారిలో మొదటి వారు సురవరం వారే. తెలంగాణా రాజకీయ చరిత్రలో ప్రతాపరెడ్డి  ప్రముఖ పాత్ర వహించారు. 1927లో ఏర్పడిన ఏకైక ప్రజాసంస్థ అయిన ఆంధ్ర మహాసభ ప్రథమ మహాసభకు అధ్యక్షత వహించారు. వారి సేవలు అందుకొనని సంస్థ తెలంగాణాలో ఏ ఒక్కటి లేదు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు. శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, వేమన ఆంధ్ర భాషా నిలయం, హిందీ ప్రచారసభ   సంస్థల ప్రగతికి ఎంతో కృషి చేశారు.

మిత్రులైన గాడిచర్ల హరిసర్వోత్తమరావు ప్రతాపరెడ్డిని కర్నూలు నుండి శాసనసభకు పోటీచేయమని కోరగా    తిరస్కరించారు. కాని పోలీస్ చర్య అనంతరం 1952 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో, మిత్రుల ఒత్తిడిపై వనపర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పక్షాన పోటీచేసి విజయం సాధించారు. కాని రాజకీయాలు ఆయనకంతగా రుచించలేదు. సురవరం  రచించిన ‘ ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ‘ కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు ‘ లభించింది. త్యాగము, దేశభక్తి, భాషాభిమానం ప్రజా శ్రేయస్సు పరమార్ధంగా జీవించిన సురవరం ప్రతాపరెడ్డి  1953 ఆగష్టు 25న దివంగతులయ్యారు.

నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశారు. తెలుగుజాతికి   చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది.  సురవరం ప్రతాపరెడ్డి జీవితాన్ని, సర్వతోముఖ సాంఫిుక సాహిత్యోద్యమ కృషిని, రాజకీయ, సాంఫిుక, సాహిత్య సేవ, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ సామాజికోద్యమాలను, వంశచరిత్రనూ, జీవిత సంగ్రహాన్ని, అంతరంగాన్నీ, విద్యాభ్యాసం, బహుభాషా పాండిత్యం, కవితా నైపుణి, పత్రికా రచన వ్యాసంగం, కవి పండిత మైత్రి, పత్రికా సంపాదకునిగా, వివిధ వ్యాసరచయితగా, గోలకొండ పత్రిక ఆవిర్భావం, తెలంగాణా ప్రాంత సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పరిశోధించి  “శ్రీ సురవరం ప్రతాపరెడ్డి జీవితం రచనలపై సమగ్ర పరిశీలన” అనే గ్రంథం డా. ఇందుర్తి ప్రభాకర్ రావు రచించారు.   తెలంగాణ రాష్ట్ర అవతరణ సంవత్సరం 2014 లో తెలంగాణా వైతాళికులు   సురవరం ప్రతాప రెడ్డి స్మారకార్థం నిర్వహించిన సభలో ఈ గ్రంథం ఆవిష్కృతమైంది.

-నందిరాజు రాధాకృష్ణ 

Leave a Reply