దేశమంతా ఇంతేనా… సుప్రీం ఆగ్రహం

Share Icons:

కొత్త ఢిల్లీ, ఆగష్టు07,

బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ వసతిగృహంలో మైనర్ బాలికలపై అత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీహార్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు, ప్రభుత్వమే  ఇందుకు  బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. ఇటీవల దేశవ్యాప్తంగా మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎందుకిలా జరుగుతోంది. ఇది అకస్మాత్తుగా నెలకొన్న అవలక్షణమా. ఇంత తక్కువ సమయంలో ఇన్ని అకృత్యాలు చోటు చోసుకోవడం ప్రభత్వాల పనితీరుకు అద్దంపడుతోంది. పురుషాహంకారంతో, కళ్లు మూసుకుపోయిన కామంతో మహిళలు, చిన్నారులు, పశువులను సైతం హింసిస్తున్న వైనాన్ని గమనించినపుడు సర్వోన్నత న్యాయస్థానానికే కాదు సామాన్యునికీ ఆగ్రహం వస్తోంది. అయితే ఏమిటి లాభం.

స్వచ్ఛంద సంస్థల విశ్వసనీయత, ఆధారాలను పరిశీలించకుండా ఎలా నిధులు మంజూరు చేస్తున్నారని సుప్రీం కోర్టు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను నిలదీసింది. రాష్ట్రంలోని వసతిగృహాలకు నిధులు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించింది. కోర్టు సహాయకులుగా నియమితులైన న్యాయవాది అపర్ణా భట్ మాట్లాడుతూ.. ముజఫర్‌పూర్ వసతిగృహంలో లైంగిక వేధింపుల బాధితులకు ఎలాంటి పరిహారం చెల్లించలేదని కోర్టుకు తెలియజేశారు. కేవలం ముజఫర్‌పూర్ మాత్రమే కాకుండా బీహార్‌లోని ప్రభుత్వ నిధులతో నడుస్తోన్న మరో 15 స్వచ్ఛంద సంస్థల్లో కూడా తనిఖీలు నిర్వహించాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.

ముజఫర్‌పూర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ నిధులతో నిర్వహించే వసతిగృహాల్లో రోజువారి తనిఖీలు నిర్వహించి, సీసీటీవీలను ఏర్పాటుచేయాలని జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. దేశంలో ప్రతి ఆరు గంటలకు ఓ మహిళ అత్యాచారానికి గురవుతున్నారని జాతీయ నేర నమోదు బ్యూరో డేటాను ఈ సందర్భంగా న్యాయమూర్తులు ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా 2016లో మొత్తం 38,947 మంది మహిళలు అత్యాచారానికి గురైనట్టు ధర్మాసనం తెలిపింది.  దేశంలోని ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ బాలికలు, మహిళలు అత్యాచారానికి గురవుతుంటే ఏం చేయాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

వసతి గృహ సిబ్బంది చిన్నారులను దారుణంగా కొట్టి, అరవకుండా ఉండేందుకు డ్రగ్స్‌ ఇచ్చి, సరైన ఆహారం కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టేవారు. అంతేకాదు వారి ఆగడాలను ఎదురించి మాట్లాడిన వారి దుస్తులను విప్పించి కొట్టి, సిగరెట్లతో శరీరమంతా వాతలు పెట్టి దారుణంగా హింసించేవారు. వీరి ఆకృత్యాలను వ్యతిరే కించిన ఓ చిన్నారిని చితకబాదడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. సిబ్బంది వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు విచారణలో తెలిసింది. అంతేకాదు, శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), జిల్లా మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పలుమార్లు ఆ గృహానికి పరిశీలించడానికి వెళ్లినప్పుడు జరుగుతున్న అరాచకాల గురించి చెబితే చంపేస్తామని బాలికలను బెదిరించారు. దీంతో భయపడిపోయిన చిన్నారులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడానికి సాహసించలేదు. సీడబ్ల్యూసీ అధికారులు వచ్చినపుడు వసతి గృహ సిబ్బంది ఎవరూ బాలికలను ఒంటరిగా వదిలిపెట్టకుండా వారితోనే ఉండేవారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కొద్ది నెలల కిందట చేపట్టిన అధ్యయనంలో ఈ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది.

సరే వెలుగు చూడని చీకటి గృహాలు ఎన్నో… ఆక్రందనలు బయటికి వినిపించకుండా అసువులు బాస్తున్న అమాయక చిన్నారులు ఎందరో. కోర్టు జోక్యంచేసుకున్న తరువాతైనా, దేశవ్యాప్తంగా ఇటువంటి అకృత్యాలను నిలువరించడానికి ప్రజా ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకుంటాయా.. ?లేకపోతే ఈ దారుణాలకు పాల్పడేవారి నుంచీ అందే ముడుపుల మత్తులో తేలియాడుతూనే ఉంటాయా….?

 

మామాట: ఇటువంటి దారుణ కాలం ఒకటి వస్తుందని బ్రహ్మంగారు  చెప్పలేదెందుకో..

Leave a Reply