బీజేపీకి రజనీ స్ట్రాంగ్ వార్నింగ్: కమల్ తో కలిసి….

super star rajanikanth sensational comments on bjp
Share Icons:

చెన్నై: గత కొంతకాలంగా సూపర్ స్టార్ రజనీకాంత్ …బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన బీజేపీలో కూడా చేరతారని ప్రచారం జరిగింది. అయితే  ఈ ప్రచారం నిజం కాదని రజనీ తేల్చేశారు. ప్రముఖ తమిళ కవి,తత్వవేత్త తిరువళ్లువర్‌కు కాషాయ రంగు పులిమినట్టుగా.. తనకూ కాషాయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని రజనీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనను బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నాలు జరిగాయని.. అయితే తిరువళ్లువర్‌ లాగే తానూ కాషాయానికి చిక్కే వ్యక్తిని కాదని వ్యాఖ్యానించారు. తాను బీజేపీకి అనుకూలం కాదని.. తన భావజాలం వేరే అని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే రజనీ కాంత్, కమల్ హాసన్ లు ఒకే వేదికపై మెరిశారు. కమల్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ కోసం చెన్నైలో కొత్త కార్యాలయం నిర్మించుకున్నారు. ఆ కార్యాలయ ప్రారంభోత్సవానికి రజనీకాంత్ సహా అనేకమంది చిత్రప్రముఖులను ఆహ్వానించారు. ఆ కార్యాలయంలోనే బాలచందర్ విగ్రహం ఏర్పాటు చేయించిన కమల్, ఆ విగ్రహాన్ని రజనీకాంత్ తో కలిసి  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రజనీకాంత్, కమలహాసన్ ఒకరిపై ఒకరు అభినందనల జల్లు కురిపించుకున్నారు. కమల్ రాజకీయాల్లో ప్రవేశించినా సినిమా రంగాన్ని మాత్రం మర్చిపోలేదని, కళను ఎల్లప్పుడూ అనుసరిస్తూనే ఉన్నారని రజనీ కొనియాడారు. కమల్ మాట్లాడుతూ, రజనీ, తాను ఒకరినొకరు గౌరవించుకుంటామని, విమర్శించుకుంటామని, ఒకరి పనిని మరొకరం ఇష్టపడుతూనే ఉంటామని వివరించారు. ఇరువురి భవిష్యత్ శుభప్రదంగానే ఉంటుందని తమకు గట్టి నమ్మకం అని తెలిపారు.

కాగా, చాలా కాలంగా దక్షిణాదిలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. తమిళనాడులో రజనీకాంత్ ద్వారా రాజకీయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం ఉంది. పలుమార్లు ఆయనతో చర్చలు కూడా జరిపింది.దీంతో రజనీ బీజేపీలో చేరుతారేమోనన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే రజనీకాంత్ చేసిన తాజా ఘాటు వ్యాఖ్యలతో ఆ ప్రచారం పటాపంచలైనట్టే. ఒకరకంగా ఇది బీజేపీకి, మోదీకి షాక్ అని అంటున్నారు.

మరోవైపు తమిళ తత్వవేత్త తిరువళ్లువర్‌కు బీజేపీ నేతలు హిందుత్వాన్ని ఆపాదించడంపై కొద్ది రోజులుగా అక్కడ దుమారం రేగుతోంది. తిరువళ్లువర్ నుదురు,భుజాలకు విభూతి,మెడలో రుద్రాక్షలు ఉన్నట్టుగా బీజేపీ ఇటీవల ట్విట్టర్‌లో ఒక ఫోటో పోస్ట్ చేసింది. తిరువళ్లువర్‌కు మతాన్ని,దైవాన్ని ఆపాదించి మాట్లాడటం అక్కడ తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీ తీరును ద్రవిడ పార్టీలు తీవ్రంగా ఖండించాయి.

 

Leave a Reply