తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుక 

Share Icons:
శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైనదశరథునకు కౌసల్య గర్భమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పుట్టాడు. అందువలన ప్రతీ సంవత్సం చైత్రశుద్ద నవమి రోజున శ్రీరామజయంతి వేడుకగా జరుపుకుంటాం.
2021ఏప్రిల్ 21న శ్రీరామనవమి పర్వదినం ఘనంగా జరుపుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాలలో శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం జరపడం అనాదిగా ఆచారంగా వస్తున్నది.  రాక్షసుడైన రావణుడు బ్రహ్మవద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తుంటాడు. అతనికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీమహా విష్ణువు అతనిని సంహరించడానికి నరుడై జన్మించ తలచి, తాను రామునిగా, ఆదిశేషుడు లక్ష్ముణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరిగింది.  విష్ణుమూర్తి  ధరించిన మానవ అవతారాలలో శ్రీరామచంద్ర మూర్తి అవతారం సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యం చెబుతున్నది.
శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపి, ఆదర్శమూర్తి అయి, ఇప్పటికీ,  అంటే  త్రేతాయుగం,  ద్వాపరయుగం పూర్తయి కలియుగం నడుస్తున్న నాటికి కూడా ఆయనను దేవునిగా కొనియాడుతూ శ్రీ రామ నవమి  పేరున నవరాత్రులు, కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. శ్రీ రాముడు జన్మించిన నవమి తిధి నాడే ఆయన వివాహం సీతా మహాదేవి తో అయిందని, అదే విధంగా రాజ్య పట్టాభిషేకం కూడ నవమి నాడే జరిగిందని పురాణం చెబుతున్నది. అందుకనే  చైత్ర శుద్ధ నవమిన మనం శ్రీరామనవమి  పండుగ జరుపుకుంటున్నాం.
 తెలుగువారు భక్తి శ్రద్ధలతో జరుపునే పండుగలలో శ్రీరామ నవమికి ప్రత్యేక స్థానం. తెలుగు నేలపై జరిగినంత వైభవంగా దేశంలో ఎక్కడా శ్రీరామ కల్యాణం జరగదంటే అది అతిశయోక్తి కాదు.  శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పుతో బాటు బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. ఎండాకాలంలో ఈ పానకం వైద్యపరంగా ఆరోగ్య హేతువని చెబుతారు.
ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి రెండు తెలుగు రాష్ట్రల్లో  భద్రాచలంలో, ఒంటిమిట్టలో వైభంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. ఉభయ రాష్టప్రభుత్వాలు ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు, పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది..
-నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply