ప్రత్యేక హోదా అంటే…?

Share Icons:

ప్రత్యేక హోదా అంటే…?

ఐదు అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తారు.

1. పర్వత ప్రాంతం. 2. జనసాంద్రత తక్కువగా ఉండడం లేదా గిరిజన జనాభా ఎక్కువగా ఉండటం 3. పొరుగు దేశాలతో సరిహద్దులు పంచుకునే వ్యూహాత్మక ప్రాంతం కావడం 4. ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనం కలిగి ఉండడం 5. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండటం.
ఈ ఐదు అంశాల్లో ఏ ఒక్క అంశం పరిధిలోకి ఆ రాష్ట్రం వచ్చినా దానికి ప్రత్యేక హోదా కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనం, ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండటం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మొదట అసోం, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. తరువాత అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ప్రత్యేక హోదా రాష్ట్రాల జాబితాలో చేర్చారు.

ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా..? వద్దా..? అన్న విషయాన్ని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘం సభ్యులతో కూడిన జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం కీలక పాత్ర పోషిస్తాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీని ఈ రెండు సంఘాలు పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర ప్రణాళికల కోసం ఉద్దేశించిన నిధులను కేంద్ర సహాయం కింద ప్రణాళికా సంఘం ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తుంది.

కేంద్ర సాయం మూడు రకాలుగా ఉంటుంది. సాధారణ కేంద్ర సాయం (ఎన్‌సీఏ), అదనపు కేంద్ర సాయం (ఏసీఏ), ప్రత్యేక కేంద్ర సాయం (ఎస్‌సీఏ). ఎన్‌సీఏ కేటగిరీ కింద అందించే మొత్తం సాయంలో 30 శాతం గ్రాంట్ల రూపంలో అందుతుంది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తమ అవసరాల మేర రుణాలు పొందే స్వేచ్ఛ ఉంటుంది. 90 శాతం గ్రాంట్లు, 10 శాతం రుణాల ఫార్ములాను కేంద్ర ప్రాయోజిక పథకాలు, విదేశీ సాయంతో నడిచే పథకాలకు వర్తింపజేస్తారు.

ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు పలు రాయితీలు, పన్ను మినహాయింపులు పొందుతాయి. ఎక్సైజ్, కస్టమ్స్, ఆదాయపు పన్ను రేట్లు, కార్పొరేట్ పన్ను రేట్లలో మినహాయింపులు ఉంటాయి. ప్రణాళికా సంఘం విదేశీ సాయంతో నడిచే పథకాలకు, నిర్దిష్ట పథకాలకు ఆర్థిక సాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సాయంతో నడిచే పథకాలకు కూడా ఆర్థిక సాయాన్ని వర్తింపజేస్తుంది.

స్థూలంగా ఇవీ ప్రయోజనాలు:-
– కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు అందుతాయి.
– కేంద్ర ప్రభుత్వ స్థూల బడ్జెట్‌లో 30% నిధులు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే వెళతాయి.
– పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించి వస్తు ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఎక్సైజ్ డ్యూటీలో భారీ స్థాయిలో రాయితీలు ఇస్తారు.
– {పత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు రుణాలపై వడ్డీని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వడ్డీ రాయితీ పథకాలు పొందే అవకాశం కూడా ఉంటుంది.

Leave a Reply