యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తు: చెరో 38 స్థానాల్లో పోటీ

Share Icons:

లక్నో, 12 జనవరి:

దేశంలోని ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తులో భాగంగా మొత్తం 80 స్థానాలకు గాను చెరో 38 స్థానాల్లో రెండు పార్టీలు పోటీ చేయనున్నాయి. ఇక కాంగ్రెస్‌తో పొత్తు లేనప్పటికి అమేథీ(రాహుల్ గాంధీ), రాయ్ బరేలీ(సోనియా గాంధీ) స్థానాల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశాయి. మిగిలిన రెండు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయిస్తామని పేర్కొన్నాయి. 

ఈ సందర్భంగా మాయావతి, అఖిలేశ్ మీడియాతో మాట్లాడుతూ… ఈ కూటమితో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిద్రలేని రాత్రులు గడపబోతున్నారని, కాంగ్రెస్ విధానాల కారణంగానే మాలాంటి పార్టీలు ఉనికిలోకి వచ్చాయని అన్నారు.

ఇక కాంగ్రెస్ లేదా బీజేపీ.. ఎవరు అధికారంలోకి వచ్చినా తేడా ఏమీ లేదని, కాంగ్రెస్ తో జతకట్టడం వల్ల మాకు పెద్దగా ప్రయోజనం లేదని,  కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే మేం ఈ పొత్తు పెట్టుకోలేదని చెప్పారు. దేశంలోని సామాన్యులు, దళితులు, మైనారిటీల హక్కులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మామాట: మొత్తానికి కాంగ్రెస్‌కి హ్యాండ్ ఇచ్చారుగా…

 

Leave a Reply