TRENDING NOW

వచ్చే ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్న వారసులు….

వచ్చే ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్న వారసులు….

విజయవాడ, 9 ఆగష్టు:

మనదేశంలో వారసత్వ రాజకీయాలు అనేవి కొత్త కాదనే చెప్పాలి….ఒకే కుటుంబం నుండి తరాల వారీగా రాజకీయ రంగంలోకి వచ్చిన వారసులు వస్తూనే ఉన్నారు. ఇక ఇలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి.

ఇక్కడ చరిత్ర గురించి ఒకసారి పక్కన పెడితే…ప్రస్తుతానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇలా చాలామంది నేతల వారసులు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

treefurn AD
Life Homepathy

ఈ నేపథ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ చాలామంది యువ‌నాయ‌కులు పోటికి ఆస‌క్తి చూపుతున్నారు. ఎలాగైనా స‌రే అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు. కుదిరితే తండ్రుల‌తో పాటు త‌మ‌కి ఒక టికెట్ కావాల్సిందేన‌ని ఇప్పటి నుండే రాజకీయ బరి సిద్ధం చేసుకుంటున్నారు.

గ‌త రెండు పార్టీ మ‌హ‌నాడు కార్య‌క్ర‌మాల్లోను పార్టీ యువ‌నేత లోకేష్‌తో పాటు చాలామంది యువ నేతలు యాక్టీవ్ రోల్ పోషించారు. వ‌చ్చే ఎన్నికల్లో పోటికి లోకేష్ కూడా సిద్ధం అవుతుండ‌టంతో ఇక యువ‌నాయ‌కులు ఆయ‌న వెంట అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు.

జిల్లాల వారీగా వారసుల వివరాలు…

అలా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కావాలని అనుకుంటున్న వారసులు వివరాలు ఒక‌సారి జిల్లాల వారీగా చూస్తే… శ్రీ‌కాకుళం జిల్లాలో సీనియ‌ర్ ఎమ్మెల్యే అయిన గౌతు శ్యామ‌సుంద‌ర్ శివాజి కుమార్తె అయిన గౌతే శిరిష వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్నారు.

అలాగే విజయనగరం సీనియర్ నేత అశోక్ గజపతి రాజు 2019 ఎన్నికల నాటికి రాజకీయాలనుంచి తప్పుకుని కూతురు పూసపాటి అదితి గజపతిరాజును తన రాజకీయ వారసురాలిగా ఎన్నికల్లో నిలబెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది.

ఇక విశాఖ జిల్లాలో మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు కుమారుడు చింత‌కాయ‌ల విజ‌య్ పాత్రుడు వ‌చ్చే ఎన్నికల్లో పోటిపై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ఇదే జిల్లాలో ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి కుమారుడు అప్ప‌ల నాయుడు టికెట్ ఆశిస్తున్నారు. శ్రీ‌కాకుళం ఎంపి రామ్మోహ‌న్‌నాయుడుకి అప్ప‌ల‌నాయుడు బావ‌మ‌రిది కావ‌డం ఒక‌వైపు త‌న తండ్రి ఎప్ప‌టి నుండో సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉండ‌టంతో త‌న‌కి ఈ సారి టికెట్ వ‌స్తే బాగుంటుంద‌ని అని అనుకుంటున్నారు.

తూర్పు, పశ్చిమ

అలాగే తూర్పులో ఎమ్మెల్యే జోత్యుల నెహ్రు కుమారుడు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు వారసులు ఎలాగైనా 2019 ఎన్నికల బరిలో దిగాలని చూస్తున్నారు. ఇక ప‌శ్చిమ‌లో సీనియ‌ర్ నేత బోళ్ళ బుల్లిరామ‌య్య మ‌న‌వడు బోళ్ళ రాజీవ్ ఏలూరు ఎంపి టికెట్ ఆశిస్తున్నారు.

కృష్ణా, గుంటూరు

కృష్ణా జిల్లాలో దేవినేని అవినాష్‌, దేవినేని చందు ఇద్ద‌రు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోరుతున్నారు. ఇప్ప‌టినుండే ఈ దేవినేని బ్రదర్స్ యువ‌నేత లోకేష్‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌న‌యుడు కోడెల శివ‌రామ్, ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు రాయ‌పాటి రంగబాబు టికెట్ పై గంపెడాశ‌లు పెట్టుకున్నారు.

ప్ర‌కాశం, నెల్లూరు

ప్ర‌కాశం జిల్లాలో గత ఎన్నికల్లో అద్దంకి నుండి గొట్టిపాటి రవి కుమార్ చేతిలో ఓడిపోయిన సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రామ్ కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్ నియోజ‌క‌వ‌ర్గం అన్వేష‌ణ‌లో ఉన్నారు. ఇదే జిల్లాలో మంత్రి శిద్దారాఘ‌వ‌రావు కుమారుడు శిద్దా సుధీర్ ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో ఇటివ‌లే మ‌ర‌ణించిన ఆనం వివేకానంద‌రెడ్డి కుమారుడు టికెట్ ఆశిస్తున్నారు.

చిత్తూరు, అనంతపురం, కర్నూలు

చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి బోజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి కుమారుడు బోజ్జ‌ల సుధీర్‌రెడ్డి, ఇదే జిల్లాలో ఇటివ‌లే మ‌ర‌ణించిన గాలిముద్దుకృష్ణ‌మ‌నాయుడు కుమారులు గాలి జ‌గ‌దీష్‌, గాలి భానులు పార్టీ టికెట్‌ ఇస్తుందని ఎదురుచూస్తున్నారు.

అనంత‌లో మంత్రి ప‌రిటాల సునీత త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్ పోటికి సై అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిటాల సునీత‌తో పాటు త‌న‌కు సీటు కావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.

ఇక ఇదే జిల్లాలో ఎంపి జేసీ దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనంత ఎంపిగా పోటిచేసే అవ‌కాశాలు ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. కర్నూల్ జిల్లాలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి త‌న‌యుడు కేఈ శ్యామ్ పోటికి రెడీ అంటున్నారు.

అయితే పార్టీ అధ్యక్షుడు చంద్ర‌బాబు ఒకే ఇంటిలో ఇద్ద‌రికి టికెట్ ఇస్తారా లేక ఎవ‌రో ఒక‌రిని పోటిలోకి దించుతారా అనేది ప్రస్తుతం పార్టీలో ఆస‌క్తిగా మారింది. మ‌రి వీరిలో ఎంద‌రిని అదృష్టం వ‌రిస్తుందో చుడాలి.

మామాట: వారసత్వ ‘రాజ(చ)కీయం….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: