గోదావరి బరాజ్ నిర్మాత సర్ ఆర్థర్ కాటన్ (2)

Share Icons:

నిన్నటి తరువాయి-

 

నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః

స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం

(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని ఈ శ్లోకానికి అర్ధం.)

ఉభయగోదావరి జిల్లాల లోని చాలా గ్రామాలలో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రముమీద స్వారీచేస్తున్న కాటన్ దొర, లేదా బస్ట్‍సైజు కాటన్ విగ్రహం. అంతగా ఈ ప్రాంతపు ప్రజల గుండెలలో 150 సంవత్సరాలు గడిచినా నిలచి ఉన్న చిరంజీవి కాటన్ దొర. ఆతరువాత ఈ మధ్య కాలములో ఈ ఆనకట్ట ను మరింత గా అభివృద్ధి పరచి, ధృడంగా  కట్టారు.

కాటన్ మ్యూజియం

కాటను దొర చేసిన సేవలను గుర్తుంచుకొని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఆయన పేరుమీద ఒక మ్యూజియం ఏర్పాటు చెయ్యడం సంతోషించదగ్గ విషయం. ఈ మ్యూజియం  ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా, కాటన్‍దొర ఆనకట్ట కట్టేటప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటుచేసారు. రెండంతస్తుల భవనమిది. రాతిగోడలకట్టడం, పైకప్పు పెంకులతో నిర్మించారు.. భవనంచుట్టూ ఆవరణలో పూలమొక్కలు, ఫెన్సింగు మొక్కలు ఉన్నాయి. మ్యూజియం ఆవరణమీదుగా,మ్యూజియం భవనానికి అతిచేరువగా ఆనకట్టకు వెళ్ళు రహదారియొక్క ఫ్లైఒవర్ వంతెన ఉన్నది. ఈవంతెన క్రింది ఖాళీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతన యంత్రాలు(రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు. ముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు పిరంగులను ఉంచారు. మ్యూజియంలోని క్రిందిగదులలో, ఆనకట్టకు సంబంధించిన వివరాలు, కొన్ని నమూనాలు ఉన్నాయి. మధ్య హాలులో ఆనకట్ట నిర్మాణానికిచెందిన చిత్రాలతో కూడిన వివరాలున్నాయి. మరొక హాలులో కాటన్ దొర జీవిత విశేషాలు వివరించిన ఫలకాలున్నాయి. మరొక హాలులో గోదావరినది రాజమండ్రి నుండి, సముద్రంలో కలియు వరకు నమూనా ఉంది. ఈ నమూనాకు వెనుక గోడపై, ఆనకట్ట నిర్మాణవిశేషాలు, ఎన్నిఎకరాలకు నీరందుతున్నదనే వివరాలు ఉన్నాయి. పై అంతస్తులో ఆంధ్రప్రదేశ్ లోని ఇతరప్రాజెక్టుల వివరాలు, కొన్ని నమూనాలు, కాటన్ ఆధ్వర్యంలో ఇతరచోట్ల జరిగిన పనుల చిత్రాలు ఉన్నాయి. దిగువ గదిలో కాటన్ దొర మునిమనుమడు ఈ మ్యూజియంను సందర్శించినప్పుడు వ్రాసిన స్పందన చిత్రము ఉన్నది. కాటన్ వివిధ వయస్సు లలోని చిత్తరువులు, తల్లిదండ్రుల చిత్రాలు, కాటన్ బస్ట్‍ సైజు విగ్రహం ఉన్నాయి. మ్యూజియం బయట అవరణలో గోదావరినది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలియువరకు చూపించే నమూనాఉంది.

ఈ మ్యూజియం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం. ఆనకట్టకు వాడిన యంత్రాలు బయట ఉంచడం వలన వాటిమీద దుమ్ము, ధూళి చేరిపోతున్నది. భవనం కిటికీ తలుపులు విరిగి ఉన్నాయి. ఎవవరైనా సులభంగా లోనికి జొరబడి, వస్తువులను దొంగలించే అవకాశమున్నది. మ్యూజియం లోపల గైడ్ లేడు, వాటి ప్రాముఖ్యత్యను వివరించటానికి. నమునాలు కూడా చాలా వరకు రంగువెలసి ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఇంకా అయన్ని గుర్తుంచుకొని ఊళ్ల లో విగ్రహాలు పెడుతున్నారు. కాని పాలకులే ఆయన్ను విస్మరించారు.. …..

-నందిరాజు  రాధాకృష్ణ

Leave a Reply