గెలిస్తే సిరీస్ సమం…ఓడితే అంతే సంగతులు…

Shaken India look to level series, sprightly Bangladesh eye another upset
Share Icons:

రాజ్ కోట్: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా-మొదట టీ20లో బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో పాటు, బౌలర్లు కూడా చేతులెత్తేయడంతో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ సిరీస్ లో భాగంగా నేడు సాయంత్రం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిస్తే భారత్ సిరీస్ సమం చేయగలదు. లేదంటే సిరీస్ బంగ్లాకు అప్పగించయాల్సిందే. కాకపోతే ఈ మ్యాచ్ కు వరుణుడి ముప్పు ఉంది.

మ్యాచ్ జరిగే గురువారమే మహా తుపాను గుజరాత్ తీరం దాటే అవకాశం ఉండడంతో రాజ్‌కోట్‌లో వర్షం పడొచ్చు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. సిరీస్ గెలిచే అవకాశం లేకపోగా.. చివరి టీ20లో సిరీస్ సమం కోసం ఒత్తిడి మధ్య పోటీకి దిగాల్సి వస్తుంది. బుధవారం సాయంత్రం కూడా రాజ్‌కోట్‌లో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో.. మ్యాచ్ సమయానికి వరుణుడు కరుణించాలని టీమ్‌ఇండియా ఆకాంక్షిస్తున్నది.

ఇక ఇండియా జట్టు విషయానికొస్తే

తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ విఫలం కాగా, మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (42 బంతుల్లో 41) ఓ మోస్తరుగా ఆడినా.. అతడి స్ట్రయిక్ రేట్‌పై, తడబాటుపై విమర్శలు వచ్చాయి. ధావన్ ధాటిగా ఆడకపోవడం వల్ల తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలో ధవన్ ఈ మ్యాచ్‌లో తప్పక దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. టెస్టు జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్ సైతం ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ (13 బంతుల్లో 22) ఒక్కడే ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఉసూరుమనిపించగా.. పంత్ (26 బంతుల్లో 27) తడబాటుతో బ్యాట్ ఝళిపించలేకపోయాడు. ఇక రాజ్‌కోట్ మ్యాచ్ తుదిజట్టులోకి సంజూ శాంసన్, మనీశ్ పాండేల్లో ఒకరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక బౌలర్లలో అయితే అనుభవలేమీ స్పష్టంగా కనిపిస్తుంది. బంగ్లా సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్‌ను కట్టడి చేయలేక తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. కీలక సమయమైన 19వ ఓవర్‌లో భారత పేసర్ ఖలీల్ అహ్మద్ వరుసగా నాలుగు ఫోర్లు సమర్పించుకోవడం సహా 4 ఓవర్లలోనే 37 పరుగులు ఇచ్చి తీవ్రంగా నిరాశ పరిచాడు. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, చాహల్ పరుగులు కట్టిడి చేసినా.. బంగ్లాను పడగొట్టడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో ఖలీల్ స్థానంలో శార్దూల్ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

అటు మొదటి టీ2లో గెలిచిన బంగ్లాదేశ్ మంచి ఊపు మీద ఉంది. తొలి మ్యాచ్ హీరో ముష్ఫికర్ (60 నాటౌట్) మరోసారి విజృంభించాలని ఆ జట్టు కోరుకుంటున్నది. తొలి మ్యాచ్‌లో స్పిన్నర్ అమినుల్ ఇస్లాం అదరగొడితే.. పేసర్ సైఫుల్ సైతం రాణించాడు. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి.. భారత్‌పై తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో సిరీస్ ముచ్చట తీర్చుకోవాలని మహ్ముదుల్లా సేన పట్టుదలగా ఉంది.

జట్లు (అంచనా)

భారత్: రోహిత్ (కెప్టెన్), ధవన్, శాంసన్/కేఎల్ రాహుల్, అయ్యర్, పంత్, శివమ్ దూబే, కృనాల్, సుందర్, చాహల్, దీపక్, శార్దూల్/ ఖలీల్.

బంగ్లాదేశ్:మహ్ముదుల్లా (కెప్టెన్), లిటన్, సౌమ్య, నయీమ్/మిథున్, ముష్ఫికర్, మొసాద్దిక్, అఫిఫ్, అమీనుల్, ముస్తాఫిజుర్, అమీన్/అరాఫత్, షఫీయుల్ ఇస్లాం.

 

 

Leave a Reply