అనుమానాల ప‌వ‌నం

Share Icons:

అనుమానాల ప‌వ‌నం

ఇప్ప‌డు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స‌మ‌స్య‌లు దాదాపుగా ప‌క్క‌కు పోయాయి. ప్ర‌తి ఒక్క‌రూ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించే మాట్లాడుకుంటున్నారు.

తెలంగాణ‌లోని కొండ‌గ‌ట్టు నుంచి ఆయ‌న త‌న రాజ‌కీయ‌యాత్ర ప్రారంభించ‌డం ఇప్పుడు అంద‌రికి చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తెలుగుదేశం పార్టీకి ఆయ‌న స‌వాల్‌గా మార‌తారా అనే స్థాయి నుంచి ఇప్పుడు పార్టీ వ్య‌తిరేక ఓట్లు చీల్చి తెలుగుదేశం పార్టీకి స‌హాయం చేసేందుకు ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా అనే అనుమానం సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం అవుతున్న‌ది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలంగాణ‌లో కూడా పోటీ చేస్తారా? ఆంధ్రాలో అన్ని స్థానాల‌కూ పోటీ చేస్తారా? అస‌లు ఆయ‌న రాజ‌కీయ వ్యూహం ఏమిటి? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం రావ‌డం లేదు.

రావ‌డం లేదు అన‌డం కంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్ప‌డం లేదు అన‌డం స‌బ‌బు.

ఆయ‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు ఏమిటో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రికి చెప్ప‌లేదు. ఆయ‌న ఎందుకు రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్నారు తెలియ‌దు.

అధికారం అవ‌స‌రం లేద‌ని ఆయ‌న చెప్ప‌డం వ‌ల్ల వ‌స్తున్న క‌న్‌ఫ్యూజ‌న్ ఇది.

పార్టీ నిర్మాణం ఎలా చేస్తున్నారో కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ స్ప‌ష్ట‌త లేదు. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్నాయి.

ఆయ‌న సీరియ‌స్ రాజ‌కీయ నాయ‌కుడు అయితే అన్ని హంగులు స‌మ‌కూర్చుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది.

ఎంత ప‌వ‌ర్ స్టార్ అయినా అక‌స్మాత్తుగా పార్టీని నిర్మించేసేయ‌లేడు.

ఒక్కో సంద‌ర్భంలో ఒక్కో మీటింగ్‌లో ఒక్కో ర‌కంగా మాట్లాడుతుండ‌టం వ‌ల్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యూహంపై స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. కేవ‌లం ప్ర‌జ‌ల‌కే స్ప‌ష్ట‌త రావ‌డం లేదా?

ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు కూడా స్ప‌ష్ట‌త రావ‌డం లేదా అనేది పెద్ద ప్ర‌శ్న‌. అస‌లు ఆయ‌న‌కు స్ప‌ష్ట‌త ఉందా అనేది మ‌రో కీల‌క ప్ర‌శ్న‌.

తెలుగుదేశం పార్టీకి మిత్రుడా? శ‌త్రువా? అజ్ఞాత మిత్రుడా? ఈ విష‌యాల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల్సి ఉంటుంది.

అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావును ఆయ‌న క‌లిశారు. ఏం మాట్ల‌డారో తెలియ‌దు.

ఒక సంద‌ర్భంలో అయితే ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ బాగానే ప‌ని చేస్తున్నారు అని కితాబు ఇచ్చేశారు. మ‌రి ఇద్ద‌రూ బాగానే ప‌ని చేస్తుంటే కొత్త పార్టీ ఎందుకు?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌లంగా ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఢీ కొంటారా? ఇలా చేస్తే తెలుగుదేశం పార్టీకి సాయం చేసిన‌ట్లు. మౌనంగా ఉంటారా?

మౌనంగానో త‌ట‌స్థంగానో ఉండేలా అయితే పార్టీ పెట్ట‌డం ఎందుకు?

కాల‌క్షేపానికా? ఈ ప్ర‌శ్న‌లు ఏవో మ‌నం వేసుకుంటున్న‌వి కాదు. అశేష ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఉన్న ప్ర‌శ్న‌లు. వీటికి స‌మాధానం ఎవ‌రు చెప్పాలి?

ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పాలి. ఇప్ప‌టికే చెప్పి ఉండాల్సింది కానీ చెప్ప‌లేదు. అందుకే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

రాజ‌కీయ పార్టీ అనేది అనుమానాల‌ను దూరం చేసుకుంటూ నిర్మాణం కావాలి కానీ అనుమానాలు పోగేసుకుంటూ నిర్మాణం కాదు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ కాపుల పార్టీ అని ఎవ‌రో అంటే దానికి ఆయ‌న ఎంతో ఆవేద‌న చెందారు.

తాను ఒక కులానికో లేక మ‌తానికో ప‌రిమితం కాద‌ని తాను భార‌తీయుడిన‌ని అన్నారు.

చంద్ర‌బాబునాయుడి నుంచి ప్యాకేజీలు తీసుకుంటున్నార‌ని ఎవ‌రో విమ‌ర్శించ‌గానే ఉద్దానం స‌మ‌స్య‌తో ముందుకు వ‌చ్చారు.

అప్ప‌టిలో రాజ‌ధాని భూముల‌పై కూడా ఇలానే స్పందించారు. ప్ర‌భుత్వంపై అసంతృప్తిగా ఉన్న చాలా మంది ప‌వ‌న్ వైపు చూస్తున్నారు.

వారిలో ఎన్నోఆశ‌లు రేకెత్తించి ఆయ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతున్నార‌నే అసంతృప్తి కూడా చాలా మందిలో ఉంది.

బ‌హుశ ఆయ‌న కార్యాలయంలో శిక్ష‌ణ పొందిన వారికి స్ప‌ష్ట‌త ఉందేమో కానీ చాలా మందికి లేదు.

ఇలా అంటే మీరెవ‌రు ప్ర‌శ్నించ‌డానికి అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన‌వ‌చ్చు.

ఆయ‌న ఏమ‌న్నా స‌రే అభిమానులు అయితే సినిమా బాగాలేక‌పోయినా ఒక సారి చూస్తారు.

అయితే ఓట‌రు మాత్రం అలా కాదు. స్ప‌ష్ట‌త ఉంటేనే ఓటేస్తాడు. ఈ ఒక్క‌టీ ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలుసుకోవాలి.

 

English Summary: Several questions arising over cinema star Pawan Kalyan’s political party. He is neither giving clarification nor explanation.

Leave a Reply