ఆత్మ విశ్వాసం:

Share Icons:

ఆత్మ విశ్వాసం:

ఆత్మవిశ్వాసం పెరగాలంటే ముందుగా ఎవరికి వాళ్ళౌ వాళ్ళని విశ్వసించాలి. ఆత్మ విశ్వాసం పెరగాలంటే అందుకు అనేక బలాలు దోహదం చెయ్యాలి. ముందుగా ఆలోచనా జ్ఞానం పెంపొందాలి. స్వతంత్రంగా ఆలోచించడం అలవరుచుకోవాలి. మిమ్మల్ని గురించి మీరు బాగా తెలుసుకోండి. మీ సంపదలను లెక్కవేయండి. మీ ఇల్లు, మీ కుటుంబం, స్నేహితులు, మీ సక్రమ ఆలోచనలు, భగవంతునిపై  మీకున్న విశ్వాసం మొదలైన వాటిని మీ సంపదలుగా గుర్తించండి. అవి మీ పాలిట శాశ్విత స్థిరాస్థులు. సానుకూల ధోరణి అవసరం. నేను మంచివాణ్ణి/దాన్ని, కల్లాకపటం తెలీని వాణ్ణి.దాన్ని, కష్టపడి పనిచేస్తాను, అనుకుంటే అలాగే తయారవుతారు. నాకు ఎలాటి తెలివితేటలు లేవు, నేను జీవితంలో ఏమీ చేయలేను, సాధించలేను అనుకుంటే అలాగే తయారవుతారు. మీరు కోరుకున్న దాన్ని సాధించగల సామర్ధ్యం మీలో ఉందన్న నమ్మకాన్ని కలిగివుండాలి. “నేను చేయగలను” అన్న ఆత్మవిశ్వాసం మీకు అద్భుతాలను సాధించిపెట్టగలదు.

సరైన  ఆలోచనను కలిగివుండండి. మీ మనసులోనే స్వర్గం, నరకం ఉన్నాయన్న సంగతి గుర్తుంచుకోండి. ఎప్పుడూ సంఘటనల సరైన పార్శ్వం వైపును మాత్రమే చూడండి. మీ చుట్టూ వున్న ప్రపంచం మీ అవసరాలకూ లేదా మీ కలలు పండేందుకూ మీతో ఏమాత్రం సహకరించదు. మీరుగా అన్నీ చేయాల్సివుంటుంది. మీ గౌరవాన్ని పోషించుకుంటూ రండి. మీరు మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తారో ప్రపంచం కూడా మిమ్మల్ని ఆ దృష్టితోనే చూస్తుంది. మీ గురించి ఎల్లప్పుడూ మంచిగానే ఆలోచించండి. ఇతరులతో పోల్చి చూసుకోండి. అంతే కాదు మీరు తక్కువవారు అన్న  న్యూనతా భావాన్ని మీలో రాకుండా చూసుకోండి. మీరు ఏమిగా ఉన్నారో అలాగే ఉంటారు. మీరు మీరే. మీకంటే బాగా చేస్తున్న వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిని పొగడండి. అసూయ అన్నది సరికాని భావోద్వేగం. ఇది మానసిక శాంతిని భంగపరచగలదు. ఇతరులను గురించి మీలో ఉన్న వక్రమైన ఆలోచనలు మీ ముఖంలోనూ, కండ్లలోనూ స్పష్టంగా కనిపిస్తాయి.

ఒక లక్ష్యాన్ని ఎన్నుకోండి. జీవితంలో ఎటుపోతున్నారో తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఒక లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని ఎన్నుకొని దాన్ని చేరడానికి కష్టపడి పనిచేయండి. మీ భావాలను చక్కగా వ్యక్తం చేయగల భాషను ఎన్నుకొని అందులో నిపుణత్వాన్ని సాధించండి. మరింతగా కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా భాషాభివృద్ధిలో మంచి ప్రగతిని సాధిస్తారు. విద్యాపరిధిని విస్తృతం చేసుకోవడం వల్ల విషయం ఏమైనాసరే దానిపై మాట్లాడగల ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. మంచిగా కనబడండి. మంచి భావాలను కలిగివుండండి. నిజాయితీతో మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. ఎలాంటి గర్వం లేకుండా మీలో మీరు తొంగి చూసుకోండి. మీ ఉద్యోగం, మీ కుటుంబాన్ని గురించి మాత్రం ఆలోచించడం కాకుండా మీ జీవితానికి కొత్త అర్ధాన్ని, కొత్త ఉద్దేశాన్ని కనుగొనండి. బీద వారికి సహాయం చేయడంలో మనసును లగ్నం చేసుకోండి. అభిరుచి శాంతిని, సమతౌల్యాన్ని ప్రసాదించి మనోబలాన్ని పెంపొందిస్తుంది. సమయ నిర్వహణ విషయంలో జాగ్రత్త అవసరం. ఎల్లప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉండండి. చిరునవ్వుకు మించిన అందాన్ని పెంచే విలువైన ఆభరణం మరోటి లేదు. ధీమాగా ఉండండి. మీలో దూసుకుపోయే గుణం ఉండకపోవచ్చు, కానీ ధీమాగా నొక్కిచెప్పగల గుణం ఉండాలి. ఆధ్యాత్మిక శక్తిని అర్ధించండి. దారిచూపమని భగవంతుణ్ణి కోరండి. అంతేకానీ దయచూపమని, అనుగ్రహింపమని మాత్రం ప్రార్ధన చేయకండి.

-నందిరాజు రాధాకృష్ణ 

Leave a Reply