విశాఖకు సచివాలయ ఉద్యోగులు…ఆన్‌డ్యూటీ..

ap adminstration shifted visakhapatnam soon
Share Icons:

విశాఖపట్నం:  స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో సీఎం జగన్ మూడు రాజధానులపై ఫోకస్ చేశారు. అందులో భాగంగానే విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే విశాఖకు పంపాలనుకున్న సచివాలయ ఉద్యోగులను ప్రస్తుతానికి ఆన్ డ్యూటీ ద్వారా పంపాలని భావిస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇవ్వడంతో వారు తుది నిర్ణయం తీసుకునేందుకు రేపు సమావేశమవుతున్నారు.

వచ్చే నెలలో విశాఖ రాజధానికి తరలింపు ప్రక్రియ ప్రారంభించకపోతే ఆ తర్వాత ఇబ్బందులు తప్పకపోవచ్చని భావిస్తున్న ప్రభుత్వం ఆన్ డ్యూటీ ఇచ్చి మరీ కొందరు కీలక శాఖల ఉద్యోగులను విశాఖ పంపాలని పట్టుదలగా ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగసంఘాలకు ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సాధారణ తరలింపుకు అయితే జీవోల జారీతో పాటు ఇతర ప్రక్రియ అంతా చేపట్టాల్సి ఉంటుంది. అదే ఆన్ డ్యూటీపై పంపొద్దని చెప్పడానికి నిబంధనలు ఏవీ లేవు. దీంతో ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

వచ్చేనెలలో కచ్చితంగా విశాఖ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదా పడటంతో ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైంది. ఇప్పుడు అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఆన్ డ్యూటీ రూపంలో తమ ముందుకు రావడంతో ఇప్పుడు ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. విశాఖకు పూర్తిస్ధాయిలో తరలిస్తే ఓకే కానీ ఇలా ఆన్ డ్యూటీ పేరుతో వెళ్లమంటే తమకు సమస్యలు తప్పవని ఉద్యోగులు భావిస్తున్నారు.

ఆన్ డ్యూటీ ఇచ్చి పంపాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రేపు సచివాలయ ఉద్యోగ సంఘాల భేటీలో దీనిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలతో పాటు తమకు అందిన డిమాండ్లను కూడా ఇందులో చర్చిస్తారు.

Leave a Reply