రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కనివ్వరా?

Share Icons:

హైదరాబాద్:

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ చర్చ ఏదైనా ఉందటే అది రేవంత్ రెడ్డి గురించే. రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ పీసీసీ పదవి ఇచ్చేస్తున్నారని తెగ వార్తలు వచ్చాయి. ఇటీవల రేవంత్ సోనియా గాంధీని కలిశారు అప్పటి నుంచి పీసీసీ పగ్గాలు రేవంత్ కే అని ప్రచారం జరుగుతుంది. పైగా  కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తెలంగాణలో కేసీఆర్, బీజేపీలను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యక్తికే టీ పీసీసీ చీఫ్ పగ్గాలు ఇవ్వాలని భావిస్తోందని,  ఈ విషయంలో అందరికంటే ముందున్న రేవంత్ రెడ్డికి ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే రేవంత్‌కు టీ పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించిందని… ఈ కారణంగానే ఆయన కుటుంబంతో కలిసి సోనియాగాంధీని కలిశారని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ పదవిని రేవంత్ రెడ్డికి కన్ఫార్మ్ చేసిందని.. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి అనుచరులు ఆనందంలో మునిగిపోయారు. ఇక వారి ఆనందాన్ని నీరు గారుస్తూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా పూర్తి విరుద్ధమైన ప్రకటన చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడి మార్పు అంశంపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్చ జరపలేదని పార్టీ ఇంఛార్జి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఆర్.సి. కుంతియా వెల్లడించారు. తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారంటూ వచ్చిన కథనాలను తోసిపుచ్చారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పీపీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి తదితర అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలిపారు. అయితే కుంతియా హఠాత్తుగా ఇలాంటి ప్రకటన చేయడం వెనుక పెద్ద కారణమే ఉందట.

వి‌హెచ్ ఫిర్యాదు

రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి దాదాపుగా ఖరారు కాగా.. పార్టీ సీనియర్ నేతలు చివరి నిమిషంలో దాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రేవంత్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్‌నే వీరు ప్రధాన అస్త్రంగా వినియోగించుకున్నట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత వి. హనుమంతరావు తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్‌ను కలిశారు.

రేవంత్ రెడ్డి తన కాలేజీ రోజుల్లో కొంత కాలం బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో పనిచేశారని, ఆ తర్వాత ఆరెస్సెస్‌ భావజాలానికి ఆకర్షితులై ఆ నేతలకు సన్నిహితంగా వ్యవహరించారని వి‌హెచ్ అహ్మద్ పటేల్ కు చెప్పారట. అనంతరం టీడీపీలో చేరి సుదీర్ఘ కాలం పాటు ఆ పార్టీ కోసం పనిచేశారని, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరరని చెప్పుకొచ్చారట. అలాంటి నాయకుడికి కాంగ్రెస్ పగ్గాలు ఎలా అప్పగిస్తారని పలువురు వి‌హెచ్ అహ్మద్ పటేల్‌ను నిలదీసినట్టు తెలుస్తోంది. ఒకవేళ తమని కాదని రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే… తాము కాంగ్రెస్‌లో కొనసాగబోమని అహ్మద్ పటేల్‌తో వ్యాఖ్యానించినట్టు సమాచారం. అందుకే కుంతియా ద్వారా పీసీసీ పదవి మార్పు  గురించి చర్చ జరగలేదని ప్రకటన చేయించరట. మొత్తానికి కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ కు పీసీసీ పదవి దక్కినివ్వకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply