RGV Missing: తనపైనే సినిమా.. వాళ్లందరినీ వాడేస్తోన్న వర్మ.. సరికొత్త జోనర్‌లో!

Share Icons:
వివాదాస్పద దర్శకుడు మరో సంచలనానికి తెర తీశారు. తన మీదే ఒక సినిమాను తీస్తున్నారు. కాకపోతే, ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయిన రియల్ క్యారెక్టర్లను ఆయన వాడేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాతో ఒక జోనర్‌ను పరిచయం చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా పేరు ‘ఆర్జీవీ మిస్సింగ్’. ఈ సినిమాతో ఫిక్షనల్ రియాలిటీ (FR) అనే జోనర్‌ను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా వర్మ తొలిసారి ప్రవేశపెడుతున్నారు.

ఈ జోనర్‌లో సినిమాలు కల్పితాలైనా అయ్యుండొచ్చు, జరిగిన కథలైనా అయ్యుండొచ్చు, నిజ ఘటనల ఆధారంగా అయినా అయ్యుండొచ్చు అని వర్మ వెల్లడించారు. అసలు వ్యక్తులపై రూపొందించిన పాత్రలను వర్ణించడానికి, ఫిక్షనల్ స్టోరీలో నిజ ఘటనలు చూపించడానికి ఈ జోనర్‌ను వాడతానని వర్మ వివరించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు సంబంధించి వర్మ వరుస ప్రకటనలు చేశారు. ‘ఆర్జీవీ మిస్సింగ్’ స్టోరీ లైన్‌ను కూడా వెల్లడించారు.

Also Read:

‘‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో విడుదలయ్యే నా ఎఫ్ఆర్ ఫిల్మ్ టైటిల్ ‘ఆర్జీవీ మిస్సింగ్’. స్టోరీ ఐడియా: ఆర్జీవీ తప్పిపోవడంతో ఆర్జీవీ కంపెనీ స్టాఫ్ షాక్ అవుతారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఆ వివాదాస్పద దర్శకుడు ఇది ప్రచారం కోసం చేస్తోన్న పని అని పోలీసులు మొదట భావిస్తారు. కానీ, ఆ తరవాత మేల్కొని నిజంగా జరిగిందని నిర్ధారిస్తారు. ఆర్జీవీ మిస్సింగ్ కేసులో ముగ్గురిని ప్రధాన నిందితులుగా గుర్తిస్తారు. 1. వెరీ పవర్‌ఫుల్ స్టార్ అభిమానులు 2. ముంబై అండర్‌వరల్డ్‌కు ఒక మెగా ఫ్యామిలీ కాంట్రాక్ట్ ఇస్తుంది 2. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఫ్యాక్షనిస్టుల సహాయంతో ఆర్జీవీని ఎత్తుకెళ్లారు’’ అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌కు గురిచేసే చాలా నిజాలు బయటపడతాయని వర్మ తెలిపారు. అంతేకాదు, ఈ సినిమాలో పాత్రలను కూడా వర్మ పరిచయం చేశారు. ఈ పేర్లను తెలుగులో చెప్పేకంటే వర్మ స్టైల్లో ఇంగ్లిష్‌లో చెపితేనే బాగుంటుంది. Prawan Kalyan, Omega Star, CBEN, LAKESH, WHY S Jagan, KCAR, KTAR.. ఇవి ప్రధాన పాత్రలు. వీరితో పాటు పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్, ఫ్యాక్షనిస్టులు కూడా ఉంటారని వర్మ వెల్లడించారు.