హడావిడిలేదు…ఆర్భాటంలేదు…సైలెంట్‌గా పని కానిస్తున్న రేవంత్…..

Share Icons:

హైదరాబాద్, 20 మార్చి:

డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైనా రేవంత్…ఈ సారి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగారు. మల్కాజిగిరి నుండి పోటీ చేస్తున్నారు. అయితే రేవంత్ ఇక్కడ పోటీ చేస్తారని ముందు ఎవరు ఊహించలేదు. సడన్‌గా కాంగ్రెస్ రేవంత్‌ని ఇక్కడ దింపింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా రేవంత్‌రెడ్డికి ధీటైన అభ్యర్థుల వేటలో పడ్డాయి.

అయితే గత ఎన్నికల మాదిరిగా రేవంత్ గాని ఆయన అనుచర గణం గాని ఇప్పుడు ఎక్కువ హడావిడి చేయట్లేదు. సైలెంట్‌గా నియోజకవర్గంలో దిగి చాపకింద నీరులా పని చేసుకుంటూ వెళుతున్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంతర్గతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌, ఎల్‌బీనగర్‌, కంటోన్మెంట్‌, తదితర నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గం పరిధిలోని పలు అసెంబ్లీ పరిధిలోని కీలక నేతలను కలుస్తున్నారు.

అటు తమతో కలిసొచ్చే ఇతర పార్టీల నేతల వైపు కూడా ఆయన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన  పేరున్న నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇలా ఎటువంటి ఆర్భాటం చేయకుండా లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో రేవంత్ ముందుకు సాగుతున్నారు.

కాగా, రేవంత్ మల్కాజిగిరి పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం నామినేషన్‌ వేయనున్నట్లు సమాచారం. ఏడు నియోజకవర్గాల నేతలతో కలిసి ర్యాలీగా నామినేషన్‌ వేయనున్నారు. మరి చూడాలి ఈ సారి రేవంత్ సైలెంట్ వ్యూహం ఏ మేర ఫలిస్తుందో…

మామాట: రాజకీయ వ్యూహాలు బాగానే ఉన్నాయి…

Leave a Reply