కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు…విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు…

Share Icons:

హైదరాబాద్:

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్‌ను కేసీఆర్‌ ఆర్థిక వనరుగా మార్చుకున్నారని, అత్యవసర విద్యుత్‌ కొనుగోళ్ల పేరిట దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈరోజు ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ…విద్యుత్‌ కొనుగోళ్లలో అక్రమాలు లేవని టీఆర్‌ఎస్‌ బుకాయిస్తోందని, ఛత్తీస్‌గఢ్‌తో దీర్ఘకాలిక ఒప్పందం నష్టమని ఈఆర్‌సీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇక అప్పటి ప్రిన్సిపాల్‌ సెక్రటరీ కూడా కొనుగోళ్లను తప్పుబట్టారని, ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్‌ కొనుగోళ్ల వెనక అదాని హస్తం ఉందని రేవంత్‌ ఆరోపించారు.

పైగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన, కాలుష్యం, నిర్మాణ ఖర్చులు ఎక్కువయ్యే కాలం చెల్లిన సబ్​ క్రిటికల్​ టెక్నాలజీని థర్మల్​ పవర్​ ప్లాంట్​ నిర్మాణంలో వాడేందుకు కేసీఆర్​ సర్కార్​ అనుమతిచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే అదంతా కూడా ఇండియా బుల్స్​ను బతికించేందుకేనని ఆరోపించారు. ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీని భద్రాద్రి థర్మల్​ ప్లాంట్​కు వాడారన్నారు. దీని వల్ల ప్రజలపై ₹7,500 కోట్ల భారం పడిందన్నారు. ప్లాంట్​ను 2017 నాటికే పూర్తి చేస్తామని చెప్పారని, రెండేళ్లు దాటినా ఒక్క యూనిట్​ కరెంట్​ కూడా తయారు చేయలేదని మండిపడ్డారు.

ఇక యాదాద్రి థర్మల్​ ప్లాంట్​కు ₹32 వేల కోట్ల పనులకు నామినేషన్​ పద్ధతిలో బీహెచ్​ఈఎల్​కు కాంట్రాక్ట్​ ఇప్పించారని చెప్పిన రేవంత్.. ఆ కంపెనీ నుంచి కేసీఆర్​ తన బంధువులకు పనులు ఇప్పించుకున్నారని చెప్పారు. అయితే దానికి కేసీఆర్​కు భారీగా కమీషన్లు ఇచ్చారని, అందుకు జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావు సంతకాలు చేశారని ఆరోపించారు. పైగా విద్యుత్ కొనుగోళ్లపై సీఎండీ ప్రభాకరరావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆయనను గన్‌పార్క్‌ ముందు నిలబెట్టి కాల్చినా తప్పులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా నామినేషన్​ పద్ధతిలో పనులు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ₹6 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. అసలు సీనియర్​ ఐఏఎస్​లను నియమించాల్సిన జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ పోస్టులో రిటైర్​ అయిన ప్రభాకర్​రావును ఎందుకు నియమించారని రేవంత్​ ప్రశ్నించారు. ఇక రేవంత్ బీజేపే నేతలపై కూడా విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ డ్రామాలు ఆపాలని, సీబీఐ విచారణకు బీజేపీని అడ్డుకుంటుందెవరని సూటిగా ప్రశ్నించారు. అయితే కేసీఆర్‌ అవినీతిపై తాము ఫిర్యాదు చేస్తామని.. విచారణ జరిపించడానికి తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిండెంట్ నడ్డా, కేంద్ర హోమ శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిలు సిద్ధమా అని రేవంత్‌ సవాల్ చేశారు. తన ఆరోపణలు తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్ చెప్పారు.

 

Leave a Reply