చలో ప్రగతి భవన్: రేవంత్ అరెస్ట్…కేసీఆర్ పై ఫైర్…

Revanth Reddy detained for trying to lay siege to Pragati Bhavan
Share Icons:

హైదరాబాద్: తమ డిమాండ్లని నెరవేర్చాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత రెండు వారాల నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమ్మెకు తెలంగాణలో ప్రతిపక్షాలు సపోర్ట్ చేశాయి, అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ నివాసముండే చలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా హైదరాబాదులోని ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ పై వచ్చిన ఆయనను ఆపేసి, అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ వద్ద నుంచి బలవంతంగా పోలీసు వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ నశించాలి అంటూ నినదించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలని, ప్రాణాలు అర్పించిన కార్మికుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను సవాల్ చేస్తూ ప్రగతి భవన్ గేట్లను తాకుతామని ఛాలెంజ్ చేసి తాకామని చెప్పారు. రేపు కేసీఆర్ ప్రగతి భవన్ గోడలను 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు.

అటు  పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారు. ఇక్కడి సమీపంలోని ఓ హోటల్‌కు చేరుకుని, ఓ ఆటోలో ప్రగతి భవన్ కు బయలుదేరారు. అయితే, అంతలోనే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి భవన్‌ వద్ద నిరసన తెలుపుతామని అన్నారు. న్యాయస్థాన ఆదేశాలను కూడా సర్కారు లెక్కచేయట్లేదన్నారు. ఈ వైఖరితో జనాల్లోకి సర్కారు తప్పుడు సంకేతాలు పంపుతోందని విమర్శించారు.

కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు ఆదేశించినా, దానిని సైతం ధిక్కరించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తానో నియంతను అన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఆయన అహంకారం ఏ స్థాయిలో ఉందో ఆర్టీసీ సమ్మెతో బయటపడిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆర్టీసీ ఉద్యమం ఇప్పటికే తీవ్ర స్థాయికి చేరిందని, అరెస్టులతో దాన్ని అడ్డుకోవాలని కేసీఆర్‌ ప్రయత్నించడం వృథా ప్రయత్నమన్నారు. నేడు ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు, పార్టీ నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. ప్రభుత్వం తీరు మారకుంటే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వచ్చితీరుతుందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

 

Leave a Reply