ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలపై రేవంత్ డిమాండ్ ఇదే…

Share Icons:

హైదరాబాద్, 23 ఏప్రిల్:

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు జరగడంతో విద్యార్ధులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం భారీగా మార్కులు తెచ్చుకున్న విద్యార్ధులు రెండో సంవత్సరంలో ఫెయిలైన సంఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పలు చోట్ల పరీక్ష ఫెయిలైన విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోమవారం ఇంటర్ బోర్డు ఆఫీసు వద్ద బాధిత విద్యార్ధులకి అండగా ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేని స్వతంత్ర సంస్థ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అసలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుంటే సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.  ప్రభుత్వ తీరుకు నిరసనగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట యూత్ కాంగ్రెస్ నిరసనలు చేపడుతుందని చెప్పారు. 22 లక్షల మంది భవిష్యత్ ఇంటర్ ఫలితాలపై ఆధారపడి ఉందని, విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నారని, విద్యార్థుల చావులకు కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు.  ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరగాలని, ఇంటర్ బోర్డు తప్పిదాలపై సీఎం కేసీఆర్ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. ఒక్క రైతు కోసం స్పందించానని చెప్పిన కేసీఆర్..లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు చీకట్లోకి వెళ్తుంటే ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

మామాట: మీ డిమాండ్లని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకుంటుందా…?

Leave a Reply