టీడీపీ ఓటు బ్యాంకుపై కన్నేసిన రేవంత్, మర్రి…

Share Icons:

హైదరాబాద్, 5 ఏప్రిల్:

మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అధికార పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రచార హోరు పెంచారు. ఈ క్రమంలోనే వారు తమ సాంప్రదాయ ఓటు బ్యాంకుతోపాటు ఆయా వర్గాల ఓటు బ్యాంకుపై దృష్టిసారించాయి. ముఖ్యంగా టీడీపీ ఓటు బ్యాంకుపై అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ కన్నేశాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గణనీయంగా ఓటుబ్యాంకు పొందినా పార్లమెంట్‌ ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థులను బరిలో దింపని విషయం తెలిసిందే.  

దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేడర్‌కు స్పష్టమైన సంకేతాలు పంపింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎవరికీ అంతుపట్టడం లేదు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఎటువైపు మొగ్గుచూపుతారనే విషయంపై ఆయా పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పొత్తుతో బరిలో దిగిన టీడీపీకి గణనీయంగానే ఓట్లు లభించాయి. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లో టీడీపీ పోటీ చేయగా ఇందులో రాజేంద్రనగర్‌లో 49వేల ఓట్లు, శేరిలింగంపల్లిలో 99వేల ఓట్లు వచ్చాయి. అలాగే మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని కూకట్‌పల్లి, ఉప్పల్‌లో టీడీపీ పోటీ చేసింది. కూకట్‌పల్లిలో టీడీపీకి 70వేలు ఓట్లు, ఉప్పల్‌లో 69వేలు ఓట్లు వచ్చాయి.

మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి అధికంగానే ఓటు బ్యాంకు ఉంది. శివార్లలో సెటిలర్స్‌ ఎక్కువగా ఉండడంతో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంకా ఓటు బ్యాంకు ఉంది. ఈ ఎన్నికల్లో వీరి ఓటు బ్యాంకుపై కాంగ్రెస్‌ భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే కిందిస్థాయిలో కేడర్‌ ఏమి ఆలోచిస్తుందనేది తెలియడం లేదు. మరోవైపు ఉన్న నేతలను కూడా తమవైపు తిప్పుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పావులుకదుపుతోంది. మరి చూడాలి ఎన్నో ఏళ్ళు టీడీపీకి అండగా ఉన్న ఓటర్లు ఈసారి ఎవరి వైపు మొగ్గుచూపుతారో..

మామాట: టీడీపీ ఓటు బ్యాంక్ ఎవరి వైపు వెళుతుందో

Leave a Reply