RCB vs RR: స్టీవ్‌స్మిత్, ఉతప్ప మెరుపులు.. బెంగళూరు టార్గెట్ 178

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ చాలా రోజుల తర్వాత బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో దుబాయ్ వేదికగా శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (57: 36 బంతుల్లో 6×4, 1×6), ఓపెనర్ రాబిన్ ఉతప్ప (41: 22 బంతుల్లో 7×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో క్రిస్‌మోరీస్ 4 వికెట్లు పడగొట్టగా.. చాహల్‌కి రెండు వికెట్లు దక్కాయి.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్మిత్ బ్యాటింగ్ ఎంచుకోగా.. తాజా సీజన్‌లో తొలిసారి ఓపెనర్‌గా ఆడిన రాబిన్ ఉతప్ప.. ఆరంభం నుంచే బెంగళూరు బౌలర్లని ఉతికారేశాడు. మరో ఓపెనర్ బెన్‌స్టోక్స్ (15: 19 బంతుల్లో 2×4) ఇబ్బంది పడినా ఉతప్ప మాత్రం స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేయడంతో 5.3 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ 50 పరుగుల మార్క్‌ని అందుకోగలిగింది. ఈ దశలో బెన్‌స్టోక్స్ ఔటవగా.. అనంతరం వచ్చిన సంజు శాంసన్ (9: 6 బంతుల్లో 1×6) చాహల్ బౌలింగ్‌లో మరో సిక్స్ కొట్టబోయి ఔటైపోయాడు. అయితే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన స్టీవ్‌స్మిత్ మ్యాచ్ గమనానికి అనుగుణంగా హిట్టింగ్ చేయగా.. జోస్ బట్లర్ (24: 25 బంతుల్లో 1×4, 1×6), రాహుల్ తెవాటియా (19: 11 బంతుల్లో 1×4, 1×6) చివర్లో అతనికి చక్కటి సహకారం అందించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన క్రిస్ మోరీస్… స్టీవ్‌స్మిత్‌‌తో పాటు జోప్రా ఆర్చర్ (2)ని ఔట్ చేసి కేవలం 4 పరుగులే ఇచ్చాడు.